ఆంధ్రప్రదేశ్ లో బంధు రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ లో బంధు రాజకీయాలు

2024 అసెంబ్లీ, లోక్‌‌‌‌సభ ఎన్నికల మహాభారతంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌‌‌‌ రాజకీయాలు సీఎం, మాజీ సీఎంల బంధుమిత్రుల మధ్య  ఆధిపత్య పోరును తలపిస్తున్నాయి. సీఎం పదవి కోసం నలుగురు మాజీ సీఎంలు ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కర్ రావు, నారా చంద్రబాబు నాయుడు (తెలుగుదేశం), వైఎస్ రాజశేఖర్ రెడ్డి (కాంగ్రెస్)ల కుటుంబ సభ్యుల మధ్య పోరు కొనసాగుతోంది. సీఎం పీఠం కోసం ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌సీపీ అధ్యక్షుడు వైఎస్​ జగన్‌‌‌‌ మోహన్‌‌‌‌రెడ్డి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌‌‌‌ రాజశేఖర్‌‌‌‌రెడ్డి కుమార్తె, కొత్తగా నియమితులైన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌‌‌‌ షర్మిల మధ్య కీలక రాజకీయ పోరు కొనసాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  మాజీ  ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత  ఎన్ చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ నాయుడు తెలుగుదేశంలో బిగ్​షాట్స్​గా వ్యవహరిస్తున్నారు. ఎన్‌‌‌‌టి రామారావు చిన్న అల్లుడు చంద్రబాబు  ఇప్పటికీ సీఎం పదవి రేసులో ఉన్నారు. అలాగే మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు తనయుడు నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. అన్ని రాజకీయ శిబిరాల్లో  సీఎం, మాజీ సీఎంల సన్నిహిత బంధువులు ఉన్నారు. 

రెండోసారి అధికార పీఠంపై జగన్, చంద్రబాబు  కన్ను 

జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు  రెండోసారి సీఎం కావాలని లక్ష్యంగా  రాజకీయ పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్​ తరఫున వైఎస్ షర్మిల, బీజేపీ తరఫున  పురంధేశ్వరి తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జనవరి 4న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో వై ఎస్ షర్మిల తన పార్టీ  వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌టీపీని కాంగ్రెస్‌‌‌‌లో విలీనం చేశారు. దీంతో  ఎన్నికల సంవత్సరంలో ఆంధ్రా రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. సోదరుడు జగన్‌‌‌‌పై షర్మిల పోటీ పడుతోంది. మొదట్లో  తెలంగాణపై దృష్టి సారించిన షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో అసెంబ్లీ, లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో తన సోదరుడు, ముఖ్యమంత్రి వైఎస్‌‌‌‌ జగన్‌‌‌‌ మోహన్‌‌‌‌రెడ్డితో తలపడనున్నారు. సీఎం పదవుల కోసం బంధుమిత్రుల పోరాటం అరుదైన దృశ్యం ఆవిష్కారమైంది.  అన్నయ్య  జగన్ మోహన్ రెడ్డిపై,  సోదరి వైఎస్ షర్మిల, మరోవైపు తన సోదరి భర్త, మరిది చంద్రబాబు నాయుడు,  పురంధేశ్వరి మధ్య అరుదైన, అసాధారణమైన పోరును ఆంధ్రప్రదేశ్ చూస్తున్నది. 

బీజేపీ చీఫ్​గా పురంధేశ్వరి

అరవై ఐదేళ్ల దగ్గుబాటి పురంధేశ్వరి 2009లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా,  2012లో వాణిజ్యం,  పరిశ్రమల   మంత్రిగా పనిచేశారు. ఆమె విశాఖపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా, గతంలో బాపట్ల నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. ఏపీని కాంగ్రెస్‌‌‌‌ విభజించడాన్ని నిరసిస్తూ ఆమె 2014 మార్చి 7న బీజేపీలో చేరారు. 2014లో  రాజంపేట నుంచి బీజేపీ టికెట్‌‌‌‌పై లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు  ఏపీ తొలి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. కాగా, 2009లో  వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ సీఎం పదవిని నిరాకరించడంతో తన సొంత రాజకీయ పార్టీ వైఎస్సార్సీపీని ప్రారంభించిన  జగన్ మోహన్ రెడ్డి 2019లో  ఏపీ సీఎం అయ్యారు. ప్రస్తుతం ఇద్దరూ రెండోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. వైఎస్ షర్మిల, మొదట్లో తన సోదరుడు సీఎం జగన్​కు మద్దతుగా ఉన్నారు, పాదయాత్ర చేపట్టారు.  కుటుంబ విభేదాలు, ఆధిపత్య పోరుతో ఆమె తన సొంత పార్టీని ప్రారంభించి రాజకీయ బాంబు పేల్చారు. ఆమె తన సోదరుడు  జగన్ మోహన్ రెడ్డితో విభేదించినప్పటికీ తల్లి  వైఎస్ విజయమ్మ మద్దతు పొందారు.

కాంగ్రెస్ ట్రంప్ కార్డ్ షర్మిల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర విభజన హామీల్లో కొన్నింటిని నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్‌‌‌‌.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పట్టు సాధించడానికి  షర్మిలను ట్రంప్ కార్డ్‌‌‌‌గా ఉపయోగిస్తోంది. కుటుంబాలను విభజించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని జగన్  ఆరోపించారు.   ఇటీవల కాకినాడలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీల పొత్తులు పెరిగి కుటుంబాలను చీల్చడంతోపాటు దౌర్జన్యాలు, బూటకపు వాగ్దానాలు, మోసాలకు తెర లేపారన్నారు.  టీడీపీ,-  పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన  కూటమిపై కూడా జగన్ విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కుటుంబంలోని ఆస్తుల విషయంలో కుటుంబీకుల మధ్య తీవ్ర వివాదాలు తలెత్తాయని, వైఎస్‌‌‌‌ విజ‌‌‌‌య‌‌‌‌మ్మ స‌‌‌‌ర్దుబాటు కోసం చేసిన ప్రయత్నాలు విఫ‌‌‌‌ల‌‌‌‌మ‌‌‌‌య్యాయ‌‌‌‌ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దివంగత వైఎస్‌‌‌‌ రాజశేఖర్‌‌‌‌రెడ్డి సోదరుడు  వైఎస్‌‌‌‌ వివేకానందరెడ్డి  దారుణ హత్య,   కడప ఎంపీ అవినాష్‌‌‌‌రెడ్డి కూడా నిందితుల్లో ఒకరిగా  ఆరోపణలు ఎదుర్కోవడం  ఆ కుటుంబంలో అగ్నికి ఆజ్యం పోసింది. 

వైసీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ

ఏపీ ఎన్నికల్లో ప్రధాన పోటీ మాత్రం  జగన్‌‌‌‌మోహన్‌‌‌‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌,  చంద్రబాబు  నేతృత్వంలోని టీడీపీల మధ్యే ఉంటుందని చెబుతున్నారు.  చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌‌‌‌కి క్రిస్మస్ కానుక పంపిన షర్మిల, తన కుమారుడి వివాహానికి నాయుడుని ఆహ్వానించారు. భవిష్యత్తులో ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవడానికి ఆమె తలుపులు తెరిచినట్లు తెలుస్తోంది. కొన్ని వర్గాల్లో అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటున్న  జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల కోసం పలువురు సిట్టింగ్ శాసనసభ్యులను మార్చారు.  తన అరెస్ట్  సానుభూతితో పునరాగమనం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు, వైఎస్ఆర్ కుటుంబంలోని వైరం తమ పార్టీ అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ విజయాలు సాధించిన కాంగ్రెస్ తాజాగా షర్మిల ద్వారా ఏపీ రాజకీయాల్లో కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందాలని భావిస్తోంది.  షర్మిల ఏపీలో  కాంగ్రెస్​ఉనికిని చాటే అవకాశాన్ని మాత్రం కొట్టేయలేం. మొత్తం మీద అందరి చూపు ఆంధ్రప్రదేశ్ ‘బంధు’ రాజకీయాలపైనే ఉంది.

-  సీఆర్ గౌరీ శంకర్, సీనియర్​ జర్నలిస్ట్