అనుభవించు రాజా : దేశం మొత్తం జనం చేస్తున్న అప్పుల్లో.. సగం ఏపీ, తెలంగాణ వాళ్లేవే..!

అనుభవించు రాజా : దేశం మొత్తం జనం చేస్తున్న అప్పుల్లో.. సగం ఏపీ, తెలంగాణ వాళ్లేవే..!

అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అగ్రస్థానంలో ఉన్నట్లు వస్తున్న రిపోర్టులు ఆందోళన కలిగిస్తున్నాయి. డెట్ టూ జీడీపీ రేషియో కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్న రిపోర్టులు వాస్తవ ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. 

తాజా డేటా ప్రకారం అత్యధిక లోన్స్ భారం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నట్లు తేలింది. అప్పుల్లో ఏపీ అన్ని రాష్ట్రాలను వెనక్కి నెట్టి ముందంజలో నిలిచిందని ఈ డేటా చెబుతోంది. ఇక్కడి ప్రజలు మిగిన రాష్ట్రాల్లో జనం కంటే ఎక్కువ రుణ భారం మోస్తున్నారని.. అత్యధికంగా అప్పులపై ఆధారపడి ఒత్తిడిలో జీవిస్తున్నారని సెంట్రల్ స్టాటస్టిక్స్ ఆఫీసు వెల్లడించింది. దీని తర్వాత తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోని ప్రజలు ఎక్కువ రుణ భారంతో ఉన్నారని తేలింది. ఉత్తర, సెంట్రల్ ఇండియా కంటే సౌత్ ఇండియా ప్రజలే ఎక్కువ రుణాల్లో కూరుకుపోయినట్లు డేటా వెల్లడించింది. 

ఈ రాష్ట్రాలు ఎక్కువ వృద్ధితో అభివృద్ధి చెందుతున్నందున ఇక్కడి ప్రజలు సులభంగా రుణాలు పొందటంతో పాటు వాటిని సునాయాసంగా చెల్లించగలుగుతున్నట్లు నిపుణులు అంటున్నారు. ఏపీలో దాదాపు 43.7 శాతం మంది అప్పుల్లో ఉండగా.. తెలంగాణలో 37.2 శాతం మంది రుణ భారాన్ని మోస్తున్నారు. మూడో స్థానంలో ఉన్న కేరళ 29.9 శాతం, తమిళనాడులో 29.4 శాతం, కర్ణాటకలోని 23 శాతం మంది అప్పుల్లో జీవిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే అనధికారికంగా ఈలెక్కలు ఇంకా ఎక్కువే ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. 

ఢిల్లీలో 3.2 శాతం, ఛత్తీస్గడ్ లో 6.5 శాతం మంది మాత్రమే రుణాలు కలిగి ఉన్నట్లు తేలింది. ఆర్థికపరమైన ఇబ్బందులే ప్రజల్లో పెరుగుతున్న అప్పులకు కారణంగా వెల్లడైంది. పరిస్థితులను ఎదుర్కోవటానికి అప్పులు చేయాల్సి వస్తోందని కానీ ఈ పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందులు మరింత పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు తలసరి ఆదాయం కూడా ఎక్కువగానే ఉంది. అందుకే ఈ ప్రాంతంలోని ప్రజలకు ఖర్చుచేసేందుకు చేతిలో డబ్బు కూడా ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు. 

అప్పులతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు డిపాజిట్ల విషయంలోనూ దూసుకుపోతున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఈ రుణాలు తీసుకోవడానికి గల ఉద్దేశ్యం ఏంటనే విషయం తెలిస్తే దక్షిణాది కుటుంబాల్లో రుణభారం ఎందుకు ఎక్కువగా ఉందనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.