రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌‌ను కలిసిన వైసీపీ ఎంపీలు

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌‌ను కలిసిన వైసీపీ ఎంపీలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార వైసీపీ పార్టీ ఎంపీలు మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ను కలిశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాడుతున్న భాష, అధికార పదవుల్లో ఉన్న వారిపై రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంపై ఫిర్యాదు చేసేందుకు మంగళవారం రాష్ట్రపతి భవన్‌ కు వెళ్లి రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను మంటగలుపుతూ గౌరవ ముఖ్యమంత్రిపై అసభ్య పదాలతో దూషణలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కు వినతిపత్రం సమర్పించారు. 
రాష్ట్రపతి భవన్ వెలుపల వైసీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తప్పులను వివరించడానికే రాష్ట్రపతిని కలిసామని, రాష్ట్ర ప్రయోజనాలను ఎలా తాకట్టు పెట్టారో రాష్ట్రపతికి వివరించామన్నారు. తెలుగుదేశం పార్టీ  కల్చర్ బూతుల కల్చర్ అంటూ, వారు నిత్యం బూతు భాష నే మాట్లాడుతున్నారని, అందుకే ఆ పార్టీని టీడీపీ అనడం కన్నా తెలుగు బూతుల పార్టీ అంటే సమంజసంగా ఉంటుందన్నారు. బద్వేల్‌లో వైసీపీ విజయకేతనం తర్వాత రాష్ట్రంలో టీడీపీ కనుమరుగు కాబోతోందని జోస్యం చెప్పారు. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారిని దూషిస్తే కఠినంగా శిక్షించేలా చట్టం చేయాలని కేంద్ర న్యాయ శాఖకు సూచించాలని రాష్ట్రపతిని కోరామని విజయసాయిరెడ్డి వివరించారు.