
కాన్పూర్: టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ప్లేస్‌లో సబ్‌స్టిట్యూట్ కీపర్‌గా వచ్చిన తెలుగు కుర్రాడు, ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్.. కీపింగ్‌లో అదరహో అనిపించాడు. సాహాకు ఉన్న 11 ఏళ్ల ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియెన్స్ ఒకే ఒక్క మ్యాచ్‌తో పక్కనబెట్టేలా చేశాడు. రిషబ్ పంత్ రాకతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొన్న 37 ఏళ్ల సాహాకు ఇప్పుడు సెకండ్ వికెట్ కీపర్ చాన్స్ కూడా లేకుండా చేస్తున్నాడు మన భరత్. శనివారం ఆటకు ముందు మెడ కండరాలు పట్టేయడంతో సాహా గ్రౌండ్‌లోకి రాలేదు. అతని ప్లేస్‌లో భరత్ గ్లోవ్స్ అందుకున్నాడు. పిచ్‌పై వేరియబుల్ బౌన్స్ ఉండటంతో బాల్ ఎలా వస్తుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి. ఒకటి, రెండుసార్లు లో లెంగ్త్‌లో వచ్చిన చోటే అనూహ్యంగా బౌన్స్ అవుతున్నాయి. ఈ టైమ్‌లో పెద్దగా ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియెన్స్ లేని భరత్... సూపర్ కీపింగ్‌తో అలరించాడు. ఈ క్రమంలో రెండు భిన్నమైన క్యాచ్‌లతో పాటు ఓ స్మార్ట్ రిఫ్లెక్స్ స్టంపింగ్‌తో అందర్ని ఆశ్చర్యపరిచాడు. అశ్విన్ బౌలింగ్‌లో యంగ్ ఇచ్చిన క్యాచ్ చాలా లో లెంగ్త్‌తో వచ్చింది. ఇక రాస్ టేలర్ క్యాచ్ అనూహ్యంగా బౌన్స్ అయ్యింది. ఈ రెండింటిని భరత్ సూపర్బ్‌గా అందుకున్నాడు. లాథమ్‌ను స్టంప్ చేసిన తీరు ఆటకే హైలెట్. బౌన్స్ బాల్‌ను చాకచక్యంగా అందుకోవడంతో పాటు రెప్పపాటులో బెయిల్స్‌ను పడగొట్టాడు. గత మూడేళ్లుగా ఇండియా–ఎకు రెగ్యులర్‌గా ఆడుతున్న 28 ఏళ్ల భరత్.. ఇప్పుడిప్పుడే తన స్కిల్స్‌ను మెరుగుపర్చుకుంటున్నాడు. ‘ఫైనల్ ఎలెవన్‌లో లేకున్నా.. సడెన్‌గా వచ్చి ఈ పెర్ఫామెన్స్ చేయడమంటే మాటలు కాదు. ఈ రోజు ఆటలో భరత్ ఆకట్టుకున్నాడు. అతను బాల్స్‌ను అందుకున్న తీరు, క్యాచ్‌లు పట్టిన విధానం, స్టంపింగ్ చేసిన తీరు చాలా బాగున్నాయి. రాబోయే రోజుల్లో మరింత రాటుదేలుతాడు’ అని అక్షర్ పటేల్ వ్యాఖ్యానించాడు.