ఏపీలో సమ్మె విరమించిన అంగన్వాడీ వర్కర్లు..

ఏపీలో సమ్మె విరమించిన అంగన్వాడీ వర్కర్లు..

ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ కార్మికులు సమ్మెను విరమించారు. ఏపీ ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో దాదాపు 42 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు అంగన్ వాడీ వర్కర్లు ప్రకటించారు. దీంతో జనవరి 23వ తేదీ మంగళవారం నుంచి తిరిగి విధులకు హాజరుకానున్న తెలిపారు. అంగన్ వాడీ యూనియన్ నాయకులతో ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు మరోసారి చర్చలు జరిపారు. 

అంగన్ వాడీ కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని..మంగళవారం నుంచి కార్మికులు విధులకు హాజరవుతారని యూనియన్ నాయకులు వెల్లడించారు. వచ్చే జులై నుంచి వేతనాల పెంపుకు హామీ ఇచ్చిందని... సమ్మెకాలంలో వేతనాలు ఇస్తామని, పోలీసులు పెట్టిన కేసులు ఎత్తివేస్తామని ప్రభుత్వం తెలిపిందని చెప్పారు.

చర్చల అనంతరం మంత్రి బొత్స సత్యనారామణ మీడియాతో మాట్లాడారు. అంగన్ వాడీ కార్మికుల 11 డిమాండ్లలో 10 డిమాండ్లను ఇప్పటికే పరిష్కారించామని ఆయన చెప్పారు.  కార్మికుల రిటైర్డ్ వయస్సు 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతామని.. రిటైర్డ్ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని కూడా రూ.50 వేల నుంచి రూ. లక్షా 20 వేలకు పెంచుతామని ఆయన తెలిపారు. హెల్పర్ కు రూ.60 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మా ప్రభుత్వం ఎప్పుడూ ఉద్యోగుల పక్షపాతిగానే ఉంటుందని మంత్రి బొత్స చెప్పారు.