ఇది మహిళలకు తీవ్ర అవమానమే.. మహిళా జర్నలిస్టులకు నిషేధంపై ప్రతిపక్ష నేతల మండిపాటు

ఇది మహిళలకు తీవ్ర అవమానమే.. మహిళా జర్నలిస్టులకు నిషేధంపై ప్రతిపక్ష నేతల మండిపాటు

న్యూఢిల్లీ: అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఆమిర్‌‌‌‌ఖాన్ ముత్తాఖీ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్టుల నిషేధంపై ప్రతిపక్ష కాంగ్రెస్​ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆ సమావేశంలో ఉద్దేశపూర్వకంగానే మహిళలు పాల్గొనకుండా ఆంక్షలు విధించారని ఆరోపించింది. ఇది దేశ మహిళలకు తీవ్ర అవమానమే అని పేర్కొన్నది. అఫ్గాన్ మంత్రి ముత్తాఖీ శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. 

ఇందులో మహిళా జర్నలిస్టులు కనిపించలేదనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. దీనిపై లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ ‘ఎక్స్’ వేదికగా కేంద్ర సర్కారుపై విరుచుకుపడ్డారు. ‘‘విదేశీ ప్రతినిధితో నిర్వహించిన మీడియా సమావేశంలో దేశంలోని మహిళా జర్నలిస్టులు పాల్గొనకుండా అడ్డుకునేందుకు అనుమతించడం ద్వారా.. మీరు వారికోసం నిలబడలేరని తేలిపోయింది” అంటూ మోదీనుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రధాని మౌనం నారీశక్తి నినాదంతో డొల్లతనాన్ని చూయిస్తున్నదని ఎద్దేవా చేశారు.

ఎలా అనుమతించారు?: ప్రియాంకా

మన దేశంలో ప్రతి మహిళకు సమాన భాగస్వామ్యం పొందే హక్కు ఉందని ఎంపీ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను మోదీ ఎలా అనుమతించారని ‘ఎక్స్’ వేదికగా నిలదీశారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం రోజునే మహిళలను అవమానించడంపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. ఇది నిజంగా చాలా షాకింగ్​ ఘటన అని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం పేర్కొన్నారు.