ప్లాంటేషన్ లో మొక్కలు నరికినవారిపై కేసు

ప్లాంటేషన్ లో మొక్కలు నరికినవారిపై కేసు

జూలూరుపాడు, వెలుగు: మండలంలోని పాపకొల్లు జీపీ పరిధిలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ సొంతూరు వెనుకతండాకు చెందిన పోడుసాగుదారులు సోమవారం ప్లాంటేషన్​లో మొక్కలను నరికివేశారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ రేంజర్ ప్రసాదరావు పోలీసుల సహకారంతో మొక్కలు నరికిన ప్రదేశాన్ని పరిశీలించారు. దీంతో అక్కడ పోడుసాగుదారులకు, ఆఫీసర్లకు వాగ్వాదం జరిగింది.  ప్లాంటేషన్ లో సుమారు రెండెకరాల్లో నాటిన మొక్కలను పోడు సాగుదారులు నరికారని రేంజర్ తెలిపారు. 

2021లో పాపకొల్లు బీట్–-బి పరిధిలో50 ఎకరాల్లో 10 రకాల మొక్కలను నాటినట్లు చెప్పారు. 1998 నుంచి సాగు చేస్తున్న భూముల్లో ఫారెస్టు అధికారులు మొక్కలు నాటి పోడు పట్టా రాకుండా చేశారని సాగుదారులు ఆరోపించారు. సాగులో లేనివారికి పోడు పట్టాలు ఇచ్చి, ఏండ్లుగా సాగులో ఉన్న తమకు పట్టాలు ఇవ్వడం లేదంటూ ఆగ్రహించారు. అక్రమంగా మొక్కలు నరికితే చర్యలు తప్పవని పోడు సాగుదారులను ఆఫీసర్లు హెచ్చరించారు. అక్రమంగా మొక్కలు నరికిన ఆరుగురుపై రేంజర్ ఫిర్యాదు చేయగా ఎస్సై గణేశ్​కేసు నమోదు చేశారు. పరిశీలించినవారిలో డీఆర్వో ధనలక్షి, లక్ష్మీనర్సు, సిబ్బంది పాల్గొన్నారు.