బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఛాతీ నొప్పితో బాధపడుతూ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేరిన గంగూలీకి డాక్టర్లు శనివారం యాంజియోప్లాస్టీ చేశారు. గంగూలీ ఆరోగ్యానికి సంబంధించి ఆస్పత్రి డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందని, పూర్తిగా స్పృహలో ఉన్నారని డాక్టర్లు తెలిపారు. అయితే ఆయన మరో 24 గంటల పాటు డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉండాలన్నారు. వంశపారంపర్యంగా వారికి గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నాయన్నారు.
గంగూలీకి యాంజియోప్లాస్టీ నిర్వహించి ఒక స్టెంట్ వేశామని వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. ఇంకా ఆయన గుండెలో మరో రెండు బ్లాక్స్ ఉన్నాయని, వీటికి చికిత్స అందించనున్నామన్నారు. ఆది, సోమవారాల్లో మరో రెండు స్టంట్లు వేయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మరో 48 గంటల పాటు గంగూలీ ఆస్పత్రిలోనే ఉంటారని తెలిపారు.
గంగూలీకి చికిత్స నిమిత్తం ముగ్గురు డాక్టర్లతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు కూడా ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. మరోవైపు గంగూలీకి గుండెపోటు వచ్చిందనే వార్త వినగానే చాలా బాధ కలిగిందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

