
- వందలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు
- అమెరికాలో సీఎం రేవంత్‌తో కంపెనీ ప్రతినిధుల భేటీ
- ఈ పెట్టుబడులు లైఫ్సైన్సెస్రంగానికి ఊతమన్న సీఎం
- హైదరాబాద్‌ను వరల్డ్ లైఫ్ సైన్సెస్ హబ్ చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : ప్రపంచ ప్రసిద్ది పొందిన జంతు ఆరోగ్య సంస్థ జొయిటిస్ కంపెనీ హైదరాబాద్‌లో తమ కేపబిలిటీ సెంటర్ ను విస్తరించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందంతో కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో జొయిటిస్ ఇండియా కేపబిలిటీ సెంటర్‌ను విస్తరించే నిర్ణయాన్ని సీఎం స్వాగతించారు.
తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు, వ్యాపార వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. హైదరాబాద్ ను ప్రపంచస్థాయి లైఫ్ సైన్సెస్ హబ్ గా తీర్చిదిద్దాలనే తమ ఆలోచనలకు ఈ పెట్టుబడులు దోహదపడుతాయని తెలిపారు. వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో జొయిటిస్ రంగ ప్రవేశం హైదరాబాద్ కు మరింత గుర్తింపు తెస్తుందని అన్నారు.
కంపెనీ విస్తరణకు హైదరాబాద్అనువైన ప్రాంతం: జొయిటిస్ చీఫ్
ఇండియాలో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉన్నదని జొయిటిస్ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్‌బాగ్ అన్నారు. తమ కంపెనీ విస్తరణ జంతు ఆరోగ్యానికి సంబంధించి సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు ఉపయోగపడుతుందని చెప్పారు.
తెలంగాణలో అందుబాటులో ఉన్న ప్రపంచస్థాయి ప్రతిభా వనరులను సద్వినియోగం చేసుకుంటామని జొయిటిస్ఇండియా కేపబిలిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ అన్నారు. ప్రపంచంతో పోటీ పడి సేవలందించడంతోపాటు రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటామని చెప్పారు. జొయిటిస్ కంపెనీ విస్తరణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులు, తమ ప్రభుత్వ విధానాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబించిందని ఐటీ, ఇండస్ట్రీస్మినిస్టర్ శ్రీధర్‌బాబు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో కొత్త ఉద్యోగాలతోపాటు జంతు ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని చెప్పారు.
జొయిటిస్కు 70 ఏండ్ల చరిత్ర
జొయిటిస్ కంపెనీ దాదాపు 70 ఏండ్లుగా జంతువుల అనారోగ్యం, రోగ నిర్ధారణ, నిరోధించే మార్గాలు, చికిత్స సంబంధిత అంశాలపై పని చేస్తున్నది. జంతు సంరక్షణలో భాగంగా పశు వైద్యులు, పెంపుడు జంతువుల యజమానులు, రైతులకు అండగా నిలుస్తున్నది. ఔషధాలతో పాటు వ్యాక్సిన్స్, రోగ నిర్ధారణలో కొత్త సాంకేతికత, ఆవిష్కరణలపై దాదాపు వంద దేశాలకు సేవలందిస్తున్నది.