
కలియుగ వైకుంఠం తిరుమలలో ఆణివార ఆస్థానం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా మలయప్పస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. మరో పల్లకిలో సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనులు దక్షిణముఖంగా వేంచేయగా..కొలువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆగమ శాస్త్రం ప్రకారం వెండి పళ్లెంలో పట్టువస్త్రాలు ఉంచుకొని పెద్ద జీయంగార్ సీరస్సు పై ఊరేగింపుగా తీసుకొచ్చి ఆనంద నిలయంలో సమర్పించారు.
ఇవాళ ( జులై 16 ) సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి స్వామి పుష్పపల్లకిపై తిరుమావిధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మూడు రోజుల పాటు 40 మంది నిపుణులు ఈ పుష్ప పల్లకిని తయారుచేశారు. చెన్నైకి చెందిన దాత సహకారంతో ఒక టన్ను సాంప్రదాయ పుష్పాలను చెన్నై, బెంగళూరు, తిరుపతి నుండి తెప్పించి అలంకరించారు. దివ్యాంగ సుందరంగా తయారు చేసిన పుష్ప పల్లకిపై శ్రీ వేంకటేశ్వరుడికి చేసేందుకు రెండు కళ్ళు సరిపోవు అంటున్నారు భక్తులు.
సాధారణంగా ప్రతి ఏటా.. సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి రోజు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే.. సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరిరోజు నిర్వహించే కొలువు కాబట్టి ఆణివార ఆస్థానం అని పేరు వచ్చింది.