ముందే సాయం చేసుంటే నా బిడ్డ బతికేది

ముందే సాయం చేసుంటే నా బిడ్డ బతికేది

సీఎం పరిహారంపై ఆమె తండ్రి అసంతృప్తి

రాంచి : ప్రేమను తిరస్కరించిందని పెట్రోల్ పోసి నిప్పంటించడంతో చనిపోయిన 19 ఏండ్ల జార్ఖండ్​ యువతి అంకిత అంత్యక్రియలు ఆమె సొంతూరులో సోమవారం ముగిశాయి. కాలిన గాయాలతో ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ తీసుకుంటూ దాదాపు వారంపాటు నరకయాతన పడిన ఆ అమ్మాయి చనిపోయిన మరుసటిరోజు.. సీఎం హేమంత్ సోరెన్ రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. దీనిపై అంకిత తండ్రి స్పందించారు. ‘‘ఈ పరిహారమేదో ముందే ఇచ్చి ఉంటే నా బిడ్డకు మెరుగైన ట్రీట్​మెంట్ చేయించి బతికించుకునేవాన్ని” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, నిందితుడు దుమ్కా జిల్లాకు చెందిన షారుక్ హుస్సేన్.. ప్రేమిస్తున్నానంటూ వెంటపడగా అంకిత తిరస్కరించింది. దీంతో కోపం పెంచుకున్న హుస్సేన్ ఆగస్టు 23న అంకితపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ పొందుతూ ఆదివారం అంకిత చనిపోయింది. ఈ ఘటనలో నిందితుడిని, అతడికి సాయం చేసిన చోటు ఖాన్​ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కస్టడీలో ఉన్న నిందితుడు నవ్వుతూ..
పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడు నవ్వుతూ ఉన్న వీడియో బయటపడటంతో సోమవారం దుమ్కా జిల్లా కేంద్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. కనీసం పశ్చాత్తాపంకూడా లేదంటూ ప్రతిపక్ష బీజేపీ ఆందోళనలు చేపట్టింది. దీంతో అడిషనల్ డీజీపీ స్థాయి పోలీస్​ ఆఫీసర్ ఈ కేసు దర్యాప్తు చేస్తారని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు.