అన్నారం బుంగలను పూడుస్తున్నరు

అన్నారం బుంగలను పూడుస్తున్నరు

మహదేవపూర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీలో ఏర్పడ్డ బుంగలు పూడ్చే పనులు మొదలయ్యాయి. గత నెలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఐదుగురు మంత్రులు బ్యారేజీని పరిశీలించిన సమయంలో అన్నారం బ్యారేజీ నిర్మాణ సంస్థ తన సొంత డబ్బులతో బుంగలను పూడ్చి సరిచేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు సదరు సంస్థ బుంగల పూడ్చివేత పనులు ప్రారంభించింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి కెమికల్​ను, ముంబై నుంచి స్కిల్డ్ వర్కర్లను తెప్పించి గత రెండ్రోజులుగా పనులు చేస్తున్నామని ఇరిగేషన్ ఆఫీసర్లు తెలిపారు.

38వ పిల్లర్ వద్ద పనులు పూర్తి కాగా, ఆదివారం 28వ పిల్లర్ వద్ద పనులు మొదలయ్యాయని తెలిపారు. బ్యారేజీ పిల్లర్ మధ్య ఏర్పడిన బుంగలను పూడ్చడానికి పాలీయురేతేన్​ కెమికల్​ను వాడుతున్నారు. ఆర్సీసీ ర్యాప్ట్ కింద ఏర్పడిన ఖాళీల్లో కెమికల్ ​వేయడం వల్ల రియాక్షన్ జరిగి బుంగల ఖాళీలు పూడుకుంటాయి. దీంతో వాటర్ బయటకు లీకేజీ అవదు. గత రెండ్రోజులుగా అన్నారం బ్యారేజీలోని 38వ పిల్లర్ వద్ద జరిగిన గ్రౌన్టింగ్ పనికి 5 టన్నుల పాలీయురేతేన్  కెమికల్ వాడారు. 28వ పిల్లర్ వద్ద పనులు పూర్తయ్యాక, ఇంకెక్కడైనా  చిన్న చిన్న లీకేజీలు ఉంటే పూడుస్తామని అధికారులు తెలిపారు.