
- చెరుకు రైతుల్లో ..చిగురిస్తున్న ఆశలు
మెదక్, వెలుగు : మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను రీఓపెన్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో చెరుకు రైతులు, కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆధీనంలో నడిపిస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ పెద్దలు గద్దెనెక్కాక ఆ విషయమే మరచిపోయారు. ఫ్యాక్టరీ పూర్తిగా మూతపడినా కూడా పట్టించుకోలేదు.
ఈ క్రమంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగా, మూతపడ్డ నిజాం షుగర్స్ఫ్యాక్టరీలను తెరిపిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సైతం ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. దీంతో మళ్లీ ఫ్యాక్టరీలకు పూర్వ వైభవం వస్తుందని, తమకు మంచి రోజులు వస్తాయని వేలాది మంది చెరుకు రైతులు, కార్మికులు భావిస్తున్నారు.
నిజాం హయాంలో ఏర్పాటు
రైతులు చెరకు పంటను ఎక్కువగా సాగు చేస్తుండటం గుర్తించి నిజాం సర్కారు చక్కెర ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 1938లో నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలో( శక్కర్‌నగర్) భారీ చక్కెర ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ సీఎం గా ఉన్నపుడు 1984లో కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి మండలం ఫ్యాక్టరీ చిట్టాపూర్ గ్రామం వద్ద రెండో నిజాం చక్కెర ఫ్యాక్టరీ నిర్మితమైంది.
1988లో మెదక్ మండలం మంబోజిపల్లి వద్ద మూడో చక్కెర ఫ్యాక్టరీ వెలసింది. దీంతో ఆయా జిల్లాల పరిధిలో చెరకు పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఏటా 10 లక్షల టన్నులకు పైగా చెరకు క్రషింగ్ జరిగేది. ఈ ఫ్యాక్టరీలు వెలిశాక ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. అనుబంధ రంగాల అభివృద్ధికి బాటలు పడ్డాయి.
లే ఆఫ్‌తో మూడు ఫ్యాక్టరీల మూత
ముడిసరుకు, నీటి కొరత ఉండటం వల్ల ఫ్యాక్టరీలు నడపలేని పరిస్థితి ఉందని ఎన్.డి.ఎస్.ఎల్. యాజమాన్యం 2015 డిసెంబరు 23వ తేదీన లేఆఫ్ ప్రకటించింది. దీంతో మూడు నిజాం చక్కెర కర్మాగారాలు మూత పడ్డాయి. మంబోజిపల్లి, శక్కర్‌నగర్, మెట్‌పల్లి నిజాం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడి ఎనిమిదేళ్లు దాటింది. గతంలో ఒక వెలుగు వెలిగి రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తమదైన ముద్రవేసిన ఈ ఫ్యాక్టరీలు మూతపడటంతో వేలాది మంది చెరకు రైతుల పరిస్థితి అగమ్యగోచరమైంది. వందలాది కార్మికుల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయి.
అమలు కాని హౌజ్ కమిటీ నివేదిక
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం నష్టాల సాకుచూపి 2002లో నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రైవేటీకరించింది. ఇందులో డెల్టా యాజమాన్యానికి 51 శాతం వాటాకాగా, ప్రభుత్వ వాటా 49 శాతం.
కారు చౌకగా డేల్టా పేపర్ మిల్ యాజమాన్యానికి కట్టబెట్టిందనే ఆరోపణలు రాగా 2004 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి నిజాం షుగర్ ఫ్యాక్టరీల ప్రైవేటీకరణపై విచారణ జరిపేందుకు 2005లో అసెంబ్లీ హౌజ్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రైవేటీకరణ ఒప్పందాన్ని రద్దుచేసి ఫ్యాక్టరీలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 2008లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే ఇది అమలుకు నోచలేదు.
నెరవేరని కేసీఆర్ హామీ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడితే వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వ స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తీసుకువస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆ పార్టీ 2014లో 2018లో అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎన్ఎస్ఎఫ్ల విషయంలో ఇచ్చిన హామీ నెరవేరలేదు. 2015 ఆరంభంలో ఎన్ఎస్ఎఫ్ల స్వాధీన ప్రక్రియ చేపట్టే దిశగా కొంతమేర కసరత్తు జరిగినా అది మధ్యలోనే ఆగిపోయింది.