Asian Games 2023:చైనా గడ్డపై శభాష్ అనిపించిన భారత వనితలు.. మరో రెండు గోల్డ్ మెడల్స్

Asian Games 2023:చైనా గడ్డపై శభాష్ అనిపించిన భారత వనితలు.. మరో రెండు గోల్డ్ మెడల్స్

చైనా, హాంగ్జౌ వేదికగా జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో భారత అట్లెట్లు శభాష్ అనిపిస్తున్నారు. డ్రాగన్ దేశంలో మువ్వెన్నల జెండాను రెపరెలాడిస్తున్నారు. మంగళవారం జరిగిన 5000 మీటర్ల పరుగు పందెంలో భారత అథ్లెట్‌ పారుల్‌ చౌదరి, జావెలిన్ త్రోలో భారత మహిళా త్రోయర్ అన్ను రాణి.. స్వర్ణ పథకాలు సాధించారు. దీంతో ఈ ఆసియా క్రీడల్లో భారత్‌ గెలిచిన గోల్డ్‌ మెడల్స్ సంఖ్య 15కు చేరింది.     

మంగళవారం సాయంత్రం జరిగిన 5000 మీటర్ల పరుగు పందెంలో పారుల్‌ చౌదరి.. కేవలం 15 నిమిషాల 14.75 సెకన్లలో పరుగు పూర్తిచేసింది. తద్వారా అగ్ర స్థానంలో నిలిచి స్వర్ణం చేజిక్కించుకుంది. అలాగే, ఈ గెలుపుతో ఆసియా క్రీడల్లో ఐదు కిలోమీటర్ల రేసులో గోల్డ్‌ మెడల్ సాధించిన తొలి భారత మహిళగా పారుల్‌ చరిత్ర సృష్టించింది. ఈ పోటీల్లో హిరోనికా రిరికా(జపాన్‌) 15 నిమిషాల 15.34 సెకన్లతో రెండో స్థానంలో నిలవగా, కిప్కిరుయ్‌ కరోలిన్‌ చెప్‌కోయిచ్‌(కజకిస్థాన్‌) 15 నిమిషాల 23.12 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది.

మరోవైపు మహిళల జావెలిన్ త్రోలో అన్నూ రాణి స్వర్ణం గెలుచుకుంది. మొత్తం ఆరు అటెంప్ట్‌లలో ది బెస్ట్ 62.92 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ ఖరారు చేసుకుంది. ఈ పోటీల్లో శ్రీలంకకు చెందిన దిల్హానీ లేకమ్గే 61.57 మీటర్లు విసిరి రజతం గెలుచుకోగా, చైనాకు చెందిన లియు హుయిహుయ్ (61.29 మీటర్లు) కాంస్యం గెలుచుకుంది. అన్నూకి ఇది రెండో ఆసియా క్రీడల పతకం. 31 ఏళ్ల ఆమె 2014లో ఇంచియాన్‌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో 59.53 మీటర్ల దూరం విసిరి కాంస్యం సొంతం చేసుకుంది.

ఇప్పటివరకు 69 పతకాలు

2023 ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు.. ఇప్పటివరకు 69 పతకాలు సాధించారు. ఇందులో స్వర్ణ పతకాలు 15కాగా, వెండి - 26, కాంస్యం 28 పతకాలు ఉన్నాయి.