అంతరిక్షంలోకి మరో 36 వన్ వెబ్ ఉపగ్రహాలు

అంతరిక్షంలోకి మరో 36 వన్ వెబ్ ఉపగ్రహాలు

ఇస్రో ‘ఎల్​వీఎం3’ రాకెట్ ప్రయోగం సూపర్ సక్సెస్ 
రెండు విడతల్లో మొత్తం 72 శాటిలైట్లు స్పేస్​లోకి చేర్చింది
20 నిమిషాల్లో మిషన్ కంప్లీట్​

శ్రీహరికోట (ఏపీ) : బ్రిటన్ కంపెనీ వన్ వెబ్​కు చెందిన మరో 36 శాటిలైట్లను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) విజయవంతంగా స్పేస్​లోకి చేర్చింది. ఆదివారం ఉదయం 9 గంటలకు ఏపీలోని శ్రీహరికోట నుంచి నిప్పులు కక్కుతూ నింగికి ఎగసిన లాంచ్ వెహికల్ మార్క్ 3(ఎల్ వీఎం3) రాకెట్ వన్ వెబ్ ఉపగ్రహాలను దిగువ భూ కక్ష్య(లో ఎర్త్ ఆర్బిట్)లోకి కచ్చితత్వంతో ప్రవేశపెట్టింది. ప్రయోగం తర్వాత ఇరవై నిమిషాలకు శాటిలైట్లను 450 కిలోమీటర్ల సర్క్యులర్ ఆర్బిట్ లోకి 87.4 డిగ్రీల వాలుతో దశలవారీగా చేర్చింది.

వన్ వెబ్ శాటిలైట్లు ఒకదానితో మరొకటి ఢీకొనకుండా కచ్చితమైన టైమ్ గ్యాప్ ఉండేలా నిర్ణయించిన కక్ష్యల్లోకి వదిలిపెట్టింది. ఇస్రో రాకెట్లలో అన్నింటికన్నా పవర్ ఫుల్ అయిన ఎల్ వీఎం3 ( జీఎస్ఎల్ వీ మార్క్ 3) రాకెట్ కు ఇది ఆరో ప్రయోగం. ఇప్పటివరకు చంద్రయాన్ 2 సహా అన్ని క్లిష్టమైన ప్రయోగాల్లోనూ ఇది అద్భుతంగా సత్తా చాటింది. 43.5 మీటర్ల పొడవు, 643 టన్నుల బరువైన ఎల్ వీఎం3 రాకెట్ తాజా ప్రయోగంలో మొత్తం 5,805 కిలోల పేలోడ్ ను మోసుకెళ్లింది. ఎల్ వీఎం3 కక్ష్యకు చేర్చిన అన్ని ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్ అందాయని, అవన్నీ అనుకున్న ఆర్బిట్స్ లోకే చేరాయని వన్ వెబ్ కంపెనీ ప్రకటించింది.  

 2 ప్రయోగాలకు రూ. 1000 కోట్లు   

ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందించడం కోసం సునీల్ భారతి మిట్టల్ ఆధ్వర్యంలోని భారతి ఎంటర్ ప్రైజెస్, వన్ వెబ్ కంపెనీ కలిసి అంతరిక్షంలో వన్ వెబ్ శాటిలైట్ల నెట్​వర్క్​ను ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా శాటిలైట్లను స్పేస్​లోకి చేర్చేందుకు పలు దేశాల అంతరిక్ష సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ ఐఎల్)తోనూ 72 శాటిలైట్లను స్పేస్​లోకి చేర్చేందుకు కాంట్రాక్ట్ చేసుకున్నాయి.

తొలి విడతగా పోయిన ఏడాది అక్టోబర్ 23న ఇస్రో36 వన్ వెబ్ శాటిలైట్లను స్పేస్​లోకి చేర్చింది. ఇప్పుడు మరో 36 ఉపగ్రహాలను దిగువ భూ కక్ష్యలోకి చేర్చింది. ఈ రెండు ప్రయోగాలకు కలిపి ఎన్ఎస్ఐఎల్​కు వన్ వెబ్ కంపెనీ దాదాపు రూ.1000 కోట్లను చెల్లించింది. ఆదివారం నిర్వహించిన ప్రయోగంతో అంతరిక్షంలో వన్ వెబ్ నెట్ వర్క్​లోని ఉపగ్రహాల సంఖ్య 618కి చేరింది. దీంతో వన్ వెబ్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమం అయిందని వన్ వెబ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ మిట్టల్ ప్రకటించారు.