ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు మరో బిగ్ షాక్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు మరో బిగ్ షాక్

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్‎ను హైకోర్టు తిరస్కరించింది. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 

ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ ప్రధాన నిందితుడు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ఆయన అమెరికా పారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న ప్రభాకర్ రావు.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని.. బెయిల్ ఇస్తే కేసు విచారణకు సహకరిస్తానని తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇరువర్గాల వాదనలు విన్నది. ఈ కేసులో ప్రభాకర్ కీలక నిందితుడు అని.. అతడికి ముందస్తు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తాడని.. అతడి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.

Also Read : మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్‌లో​​ 8 మంది డాక్టర్లు డ్యూటీకి డుమ్మా

 పోలీసుల అభ్యర్థనలతో ఏకీభవించిన హైకోర్టు.. ప్రభాకర్ బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. మరోవైపు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్ పోర్టు రద్దు చేయడంతో పాటు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో ప్రభాకర్ నెక్ట్స్ ఏం చేస్తాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అమెరికా నుంచి వచ్చి పోలీసుల విచారణకు సహకరిస్తాడా..? లేదా అమెరికాలోనే ఉంటారా..? అన్నది వేచి చూడాలీ.