తిరుమలలో మరో చిరుత.. కేకలు వేస్తూ పరుగులు తీసిన భక్తులు

తిరుమలలో మరో చిరుత.. కేకలు వేస్తూ పరుగులు తీసిన భక్తులు

తిరుమలలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే చిన్నారిని బలితీసుకున్న చిరుతను ఉదయమే బోనులో బంధించారు. ఈ పరిణామంలో కాస్త ఊపిరి పీల్చుకున్న భక్తులకు మరో భయాందోళన కలిగించే ఘటన ఎదురైంది. మరో చిరుత కనిపించి వారిని భయభ్రాంతులకు గురి చేసింది. అలిపిరి నడక మార్గంలోని నామాల గవి ప్రాంతంలో వెళ్తున్న భక్తులకు చిరుత కనిపించింది. దీంతో వారు కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఇప్పటికైతే చిరుత అక్కడ్నుంచి వెళ్లిపోయింది. కానీ మళ్లీ ఆ చిరుత వచ్చి ఎక్కడ్నుంచి వస్తుందో, దాడి చేస్తుందేమోనన్న భయం ఇప్పటికీ అక్కడున్న వారిని వెంటాడుతోంది.

అయితే రీసెంట్ గా బోనులో చిక్కిన చిరుత పిల్లలే సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. కాగా ఈ మధ్యే తిరుమల నడక మార్గంలో ఆరేళ్ల బాలికను చిరుత ఎత్తుకెళ్లి చంపి తిన్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ బాలికను లక్షితగా గుర్తించిన అధికారులు.. ఆమెపై దాడి చేసింది ఆడ చిరుతేనని స్పష్టం చేశారు. పబ్లిక్ వ్యూ పాయింట్ నామాల బావి దగ్గర చిరుత బోనులో చిక్కిందని ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

ఇదిలా ఉండగా పులులను ట్రాక్ చేసేందుకు తిరుమల నడక మార్గంలో చాలా చోట్ల ట్రాకింగ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సుమారు 500వరకు కెమెరాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం.