రాష్ట్రంలో మరో ఉద్యమం తప్పదా! : డా. ప్రవీణ్ రెడ్డి

రాష్ట్రంలో మరో ఉద్యమం తప్పదా! : డా. ప్రవీణ్ రెడ్డి

స్వరాష్ట్ర ఉద్యమ ప్రాధాన్య నినాదమైన విద్యారంగంలో నూతన ఒరవడితో ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతమై పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలతో కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని విద్యార్థి లోకం ఆశించింది. కానీ, గత తొమ్మిదేండ్లుగా పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు బోధన, బోధనేతర నియామకాలు, వసతుల కల్పన, నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం జరిగింది. బీఆర్ఎస్​ప్రభుత్వ విధానపరమైన వైఫల్యంతో విద్యా ప్రమాణాలు పాతాళానికి పడిపోతున్న దుస్థితిని జాతీయ స్థాయిలో అనేక సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. మరో వైపు ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యత లోపించి అభ్యసన సంక్షోభంలో పడింది. కార్పొరేట్ సంస్థలు వేళ్లూనుకుపోయి ప్రచార ఆర్భాటాలు, అధిక ఫీజులతో పేద మధ్య తరగతి కుటుంబాలకు చదువులు కష్ట తరంగా మారాయి. విద్యా హక్కు చట్టం అమలుతోనైనా అధిక ఫీజు దోపిడీ నియంత్రణలోకి వస్తుందని ఆశిస్తే అదీ కార్యరూపం దాల్చకపోగా కార్పొరేట్ శక్తులు మండల కేంద్రాలకు విస్తరిస్తున్నాయి. కేజీ టు పీజీ ఉచిత విద్య నినాదంతో ఉపశమనం లభిస్తుందని ఆశావహ దృక్పథంతో చూసిన ఎదురుచూపులు ఎండమావులే అయ్యాయి. గ్రామీణ,పేద విద్యార్థుల బంగారు భవితకు పునాదులు వేసేందుకు నిర్దేశించిన సంక్షేమ వసతి గృహాలను నిర్లక్ష్యం చేస్తున్నది ప్రభుత్వం. రాష్ట్రంలో విద్యారంగానికి 2014 లో 12 శాతం నిధులు కేటాయించగా, 2022 లో ఆ నిధులు 7.5 శాతానికి కుదించి పేదలకు విద్యను దూరం చేస్తున్నది. పేద వర్గాల విద్యార్థులకు ఆర్థిక చేయూతనిచ్చే ఉపకార వేతనాలు, ఫీజు రియింబర్స్​మెంట్ నిధుల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ప్రస్తుతం రూ. 5000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. విద్యార్థులను ఫీజుల కోసం యాజమాన్యాలు వేధిస్తున్నాయి. 

శాంతి భద్రతలు ఏవి?

తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించి సామాన్య ప్రజలకు కనీస రక్షణ లేని దుస్థితి నెలకొంది. నడి రోడ్లపై బహిరంగ హత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, దాడులు, చదువుకునే విద్యార్థినులపై ఆకతాయిల వికృత చేష్టలు, ఆర్థిక లావాదేవీలు, భూ కబ్జాలతో హత్యలు, లవ్ జీహద్ పేరుతో ఉద్దేశపూర్వకంగా అమాయక ఆడపిల్లలను ఆకర్షిస్తూ అమానవీయంగా హత్యలు, సంఘ విద్రోహ శక్తుల కార్యకలాపాలు, పరువు హత్యలు, మిస్సింగ్ కేసులు నిత్యకృత్యమయ్యాయి. రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యల పట్ల ప్రశ్నించిన విద్యార్థి నాయకులను జైళ్లకు పంపడం, నేరెళ్ల దళితులపై  పోలీసుల థర్డ్ డిగ్రీ, ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేసిన ఘటనలు తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నోచోటుచేసుకున్నాయి.  సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేరాలు నియంత్రిస్తున్నామని పోలీసు అధికారులు ప్రకటిస్తుండగా, మరో వైపు నేరాల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. 2014 నుంచి 2022 వరకు నమోదైన కేసుల సంఖ్యను గమనిస్తే దాదాపు 42 శాతం వరకు నేరాలు పెరిగినట్లు ప్రభుత్వ అధికారిక గణాంకాల ద్వారానే స్పష్టమవుతున్నది. 

ఆరోగ్యమెక్కడ?

ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ప్రతీ ప్రభుత్వ కనీస బాధ్యత అని, స్వరాష్ట్రంలో వైద్యం అందుబాటులో ఉంటుందని అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ప్రకటనలను మనం మరిచిపోలేదు. ఇటీవల ఇబ్రహీంపట్నం, మహబూబ్ నగర్, గాంధీ ఆసుపత్రుల్లో బాలింతలు మృతి చెందడం అత్యంత అమానవీయం. పేద ప్రజలు ఆపదతో ప్రభుత్వ ఆసుపత్రిలోకి వస్తే శవాలతో బయటకు వెళ్లే అత్యంత దురదృష్టకరమైన దుస్థితి నెలకొంది. డాక్టర్ల నియామకాలు లేకపోవడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిధుల కొరతతో అనేక అమానవీయ ఘటనలు తరచూ పునరావృతం అవుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకుంటున్న జాడలేదు. ఆరోగ్యశ్రీ నత్తనడక పేదలకు శాపంగా మారింది. ఆయుష్మాన్​భారత్​పథకం రాష్ట్రంలో అమలు జరుగుతున్నదా, లేదా ఎవరికీ తెలియదు.

మరోసారి ఉద్యమించాలె..

స్వరాష్ట్ర సాధన లక్ష్యంగా 6 దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ మహోద్యమంలో విద్యార్థి, నిరుద్యోగ, కార్మిక, కర్షక సకల జనులు అకుంఠిత దీక్ష, సహనం, సాహసంతో సాగించిన అలుపెరగని శాంతియుత పోరాటంతో ‘తెలంగాణ రాష్ట్రం’ సిద్ధించి తొమ్మిదేండ్లు గడుస్తున్నా, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోగా పాలన అస్తవ్యస్థమై సామాన్య ప్రజల జీవితాలు మరింత దుర్భర స్థితికి గురవుతున్నాయి. తెలంగాణను ప్రగతి పథంలో నడిపించేందుకు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి, సామాన్య ప్రజలకు ఉచిత వైద్యం, వ్యవసాయానికి చేయూత అందించి అవినీతి రహిత పాలన, పేద ప్రజల స్థితి గతులు మెరుగుపడేందుకు స్వరాష్ట్రంలో మరో భారీ విద్యార్థి ఉద్యమం అనివార్యం.

రైతుకు ఏది భరోసా?

రాష్ట్రంలో వ్యవసాయ రంగం దేశంలోనే అగ్రగామిగా వెలుగొందుతోందని ప్రకటనలు గుప్పిస్తూ దేశవ్యాప్త ప్రచారం చేస్తున్న ప్రభుత్వ పెద్దలు తొమ్మిదేళ్ల పాలనలో వేల మంది కౌలు రైతుల ఆత్మహత్యలపై మాట్లాడక పోవడం విడ్డూరం. రైతు బీమా, రైతు బంధు అందిస్తున్నామని ఇది దేశానికి ఆదర్శవంతమైన పథకాలని ప్రకటిస్తున్న ప్రభుత్వం ఎన్నికల హామీలో రుణ మాఫీ చేస్తామని ప్రకటించి నాలుగు ఏండ్లు గడిచినా ఎందుకు విఫలమైంది? ప్రాజెక్ట్​లకు భూ సేకరణ చేసి నష్ట పరిహారం అందించకపోవడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరికొందరు విధిలేక తమకు తాము చితి పేర్చుకొని నిప్పంటించుకొని ఆత్మహుతికి పాల్పడిన దారుణాలను పరిశీలిస్తే రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ఎలా ఉందో బయటపడుతుంది.

- డా. ప్రవీణ్ రెడ్డి,
వర్కింగ్ కమిటీ మెంబర్
ఏబీవీపీ