సినీ నటి సుమలత పోటీచేస్తున్న కర్నాటకలోని మండ్య లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమె పేరుతో ఉన్న మరో ముగ్గురు బరిలోకి దిగారు. ఆ ముగ్గురు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నట్లు నామినేషన్లు వేశారు. ఈ స్థానం నుంచి జేడీఎస్ -కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా సీఎం హెచ్ డీ కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ పోటీ చేస్తున్నారు. కన్నడ రెబల్ స్టార్, దివంగత అంబరీష్ సతీమణి, సినీ నటి సుమలత.. ఇటీవల స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగారు. ఆమెకు బీజేపీ మద్దతిస్తోంది. ఈ క్రమంలో ఇదే నియోజకవర్గం నుంచి మరో ముగ్గురు సుమలతలు బరిలోకి దిగారు. ఇందులో ఒకరు సుమలత మంజేగౌడ, మరొకరు సుమలత సిద్ధేగౌడ, ఇంకొకరు ఎస్.సుమలత. దీనిపై అసలు సుమలత స్పందిస్తూ.. తనను ఓడించడానికి ప్రత్యర్థులు పన్నిన వ్యూహమన్నారు. ఇలాంటి కుట్రలు జరుగుతాయని నెల రోజుల ముందు నుంచే తనకు తెలుసని, అయినా భయపడేది లేదని స్పష్టం చేశారు.
