ఢిల్లీ మంత్రి వీడియో మరొకటి వైరల్ 

ఢిల్లీ మంత్రి వీడియో మరొకటి వైరల్ 
  •     లీకైన వీడియోలపై ప్రజలే జవాబు చెబుతారన్న కేజ్రీవాల్ 


న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కు సంబంధించిన వీడియో మరొకటి బయటకొచ్చింది. జైలులోని తన సెల్ లో ఆయన కొందరితో సమావేశమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెల్ లో బెడ్ పై రిలాక్స్ అవుతున్న జైన్.. ముగ్గురితో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. వాళ్లందరూ టీషర్ట్, షార్ట్, నైట్ ప్యాంట్ లాంటి క్యాజువల్ క్లాత్స్ వేసుకున్నారు. సస్పెండ్ అయిన తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ కొద్దిసేపటికి అక్కడికి రాగా, సెల్ లో ఉన్న ముగ్గురూ బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత జైన్, అజిత్ కుమార్ చాలాసేపు మాట్లాడుకున్నారు. అజిత్ కుమార్ కుర్చీలో కూర్చోగా, జైన్ తన బెడ్ పై పడుకున్నారు. ఇది సెప్టెంబర్ 12న రాత్రి 8 గంటల ప్రాంతంలో రికార్డయిన సీసీటీవీ ఫుటేజీ అని వీడియోలో కనిపిస్తోంది. కాగా, ఇంతకుముందు జైన్ మసాజ్ చేయించుకుంటున్న, స్పెషల్ ఫుడ్ తింటున్న వీడియోలు బయటికొచ్చాయి. ఆయనకు వీఐపీ ట్రీట్ మెంట్ అందుతోందనే ఆరోపణలతో జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ ను సస్పెండ్ చేశారు. 

బీజేపీ వీడియోలు వర్సెస్ ఆప్ హామీలు: కేజ్రీవాల్ 

ఈ వీడియోలన్నీ బీజేపీ పనేనని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. లీకైన వీడియోలపై తాను స్పందించాల్సిన అవసరంలేదని, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే వాటికి జవాబు చెబుతారని అన్నారు. ‘‘ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల పోరు.. బీజేపీ 10 వీడియోలకు, కేజ్రీవాల్ 10 హామీలకు మధ్యే జరుగుతోంది. డిసెంబర్ 4 వరకు ఆగండి.. ఢిల్లీ ప్రజలు ఆ వీడియోలన్నింటికీ సమాధానం చెబుతారు” అని తెలిపారు. జైలు రూల్స్ ప్రకారమే జైన్ కు సౌలతులు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.