సీఏఏ సరే.. పాకిస్తాన్‌ సంగతేంది

సీఏఏ సరే.. పాకిస్తాన్‌ సంగతేంది
  • 70 ఏండ్లుగా ఆ దేశంలో మైనార్టీలపై అత్యాచారాలు
  • వాటిపై గొంతు విప్పండి,ర్యాలీలు, ధర్నాలు చేయండి
  • కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు మోడీ సూచన
  • తమకూరులోని సిద్ధ గంగ మఠాన్ని సందర్శించిన మోడీ

‘‘పార్లమెంట్​కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. పాకిస్తాన్​ చేస్తున్న అకృత్యాలను అంతర్జాతీయ వేదికలపై బయటపెట్టాలి. మీరు నిరసన తెలపాలి అనుకుంటే.. 70 ఏండ్లుగా పాక్​ తమ దేశంలోని మైనార్టీలపై జరుపుతున్న అకృత్యాలపై గొంతు విప్పండి. ఆందోళనలు చేపట్టండి. మీకు ఆ గట్స్​ ఉన్నాయా?”- మోడీ

తమకూరు(కర్నాటక): సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్(సీఏఏ)కు వ్యతిరేకంగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేస్తున్న ఆందోళనలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ మండిపడ్డారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు సీఏఏపై చేస్తున్న ఆందోళనలు, సృష్టించిన పరిస్థితులు అన్నీ పార్లమెంట్​కు వ్యతిరేకమన్నారు. ఈ నిరసనలు తెలిపేవారంతా 70 ఏండ్లుగా పాకిస్తాన్​లో మైనార్టీలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. పొరుగు దేశాల్లో అకృత్యాలకు గురై శరణార్థులుగా మన దేశానికి వచ్చిన వారిని కాపాడాల్సిన, మద్దతుగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందని, ఇది మన సంస్కృతి అని, జాతీయ బాధ్యత అని చెప్పారు. ‘‘మీరు నినాదాలు చేయాలనుకుంటే, పాక్​లో మైనార్టీలపై జరుగుతున్న అకృత్యాలపై నినాదాలు చేయాలి. మీరు ర్యాలీలు తీయాలనుకుంటే, దళితులు, పాక్​ నుంచి ఆశ్రయం కోరుతూ వచ్చిన వారికి మద్దతుగా చేయండి. మీరు ధర్నాలు చేయాలనుకుంటే, పాక్​ అకృత్యాలకు వ్యతిరేకంగా చేయండి”అని సూచించారు.

సిద్ధగంగ మఠంలో మోడీ

రెండు రోజుల పర్యటన కోసం మోడీ గురువారం కర్నాటక చేరుకున్నారు. బెంగళూరులోని యలహంక ఎయిర్​బేస్​కు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్​లో తుమకూరు చేరుకున్నారు. ఆయన వెంట కర్నాటక సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ సీఎం సదానంద గౌడ తదితరులు ఉన్నారు. సిద్ధగంగ మఠానికి చేరుకున్న మోడీకి నుదుటన విభూది పెట్టి, మెడలో రుద్రాక్ష మాల వేసి ఆశ్రమం ప్రతినిధులు స్వాగతం పలికారు. 111 ఏండ్ల వయసులో గతేడాది కన్నుమూసిన శివకుమార స్వామీజీ సమాధి(గద్దుగె) దగ్గర మోడీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శివకుమార స్వామి ఫొటోలు, ఆయన వినియోగించిన వస్తువులు, దుస్తులు, ఇతర సామగ్రితో ఏర్పాటు చేయనున్న మ్యూజియానికి శంకుస్థాపన చేశారు. ఈ మ్యూజియం ద్వారా శివకుమార స్వామీజీ చేసిన సేవలు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపుతాయని చెప్పారు. సిద్ధగంగలాంటి పవిత్ర స్థలం నుంచి 2020 సంవత్సరాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, అదే సమయంలో శివకుమార స్వామీజీ లేకపోవడం వెలితిగా ఉందని మోడీ అన్నారు. ఆశ్రమంలో ఓ మొక్కను నాటారు. ఆశ్రమ ప్రస్తుత గురువు సిద్ధలింగ స్వామీజీ.. శివకుమార స్వామీజీ వెండి ప్రతిమను ప్రధాని మోడీకి బహూకరించారు. సిద్ధగంగ మఠంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

వారిని కాపాడటం మన బాధ్యత

ఇన్నాళ్లూ బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించిన ఈ పార్టీలు, ఇప్పుడు పార్లమెంట్​కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని ఆరోపించారు. వీరంతా దళితులు, పాకిస్తాన్​లో అణచివేతకు గురై శరణార్థులుగా ఇక్కడికి వచ్చిన వారికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. దేశ విభజన సమయం నుంచి పాకిస్తాన్​లో ఇతర మతాల వారు ఎన్నో అకృత్యాలకు గురయ్యారని, హిందూ, సిక్కు, క్రిస్టియన్, జైన్​ ఇలా అందరిపైనా అత్యాచారాలు పెరిగిపోయాయని, దీంతో సొంత ఇండ్లు వదిలి వేలాది మంది శరణార్థులుగా ఇండియాకు వచ్చారని చెప్పారు. ఇంత జరిగినా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పాక్​ గురించి ఒక్క మాట మాట్లాడలేదని, కానీ, శరణార్థులుగా వచ్చిన వారికి రక్షణ కల్పించేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై మాట్లాడాలంటే ఆ పార్టీల గొంతు ఎందుకు మూతపడిపోతోందని ప్రశ్నించారు. పాక్​ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులు, దళితులు, అణచివేతకు గురైన ఇతర వర్గాలకు సహాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వారిని అలా వదిలేయలేమని, వారికి రక్షణగా నిలబడం మన సంస్కృతి అని చెప్పారు.

ప్రధాని కిసాన్‌ యోజనలో అన్ని రాష్ట్రాలు చేరాలి

తుమకూరులో నరేంద్ర మోడీ కృషి కర్మ అవార్డులు అందించారు. ప్రధాని కిసాన్‌‌ సమ్మాన్‌‌ యోజనలో చేరని రాష్ట్రాలపై విమర్శలు చేశారు. ఆయా రాష్ట్రాల్లోని రాజకీయాల వల్ల రైతులకు నష్టం కలుగుతోందని అన్నారు. “కిసాన్‌‌ సమ్మాన్‌‌ యోజనలో భాగం కాని రాష్ట్రాలు ఇప్పటికైనా చేరాలని ఈ న్యూ ఇయర్‌‌‌‌ సందర్భంగా ఆశిస్తున్నాను” అని అన్నారు.

అందరి సహకారంతో రామ మందిరం

టెర్రరిజంపై ఇండియా వైఖరి మారిందని, ఆర్టికల్​ 370ని రద్దు చేయడం ద్వారా జమ్మూకాశ్మీర్​ప్రజల్లో అభద్రతాభావం, భయాన్ని దూరం చేయగలిగామని ప్రధాని మోడీ చెప్పారు. దీంతో జమ్మూకాశ్మీర్, లడఖ్​లో అభివృద్ధికి కొత్త ప్రారంభం లభించిందని తెలిపారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, అందరి సహకారంతో గ్రాండ్​ రామ మందిరాన్ని నిర్మిస్తామని ప్రకటించారు.