రూ.500 లంచం కేసులో.. 20 ఏండ్ల తర్వాత నిందితుడికి విముక్తి

రూ.500 లంచం కేసులో..  20 ఏండ్ల తర్వాత నిందితుడికి విముక్తి

హైదరాబాద్, వెలుగు:2005లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన రూ.500 లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఒక వ్యక్తికి 20 ఏండ్ల తర్వాత కేసు నుంచి విముక్తి లభించింది. మ్యూటేషన్ ఫైల్ పెండింగ్‌లో లేనప్పుడు లంచం డిమాండ్ చేయడం లేదా తీసుకోవడం జరగదని12 ఏండ్ల క్రితం కింది కోర్టు ఈ కేసును కొట్టివేసింది. ఈ తీర్పుపై ఏసీబీ.. చేసిన అప్పీల్‌ను కూడా ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. ఫిర్యాదుదారు స్వయంగా కక్షసాధింపు, దురుద్దేశంతో ఫిర్యాదు చేసినట్లు అంగీకరించినట్లు హైకోర్టు గుర్తుచేసింది. బేగంపేటకు చెందిన బి. శ్రీనివాస్ తన ఇంటిని కొనుగోలు చేసిన సమయంలో మ్యూటేషన్ చేయించేందుకు సికింద్రాబాద్ డివిజన్ అదనపు కమిషనర్ కార్యాలయంలోని ట్యాక్స్ విభాగానికి వెళ్లారు.

 అక్కడ జూనియర్ అసిస్టెంట్ అర్షిత్ కుమార్ తనను 500 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని శ్రీనివాస్​ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో 2005 ఏప్రిల్ 21వ తేదీన ఏసీబీ అధికారులు అదనపు కమిషనర్ కార్యాలంయపై దాడి చేసి అర్షిత్ కుమార్‌ను పట్టుకుని కేసు నమోదు చేశారు. 2013లో కింది కోర్టు ఈ కేసును కొట్టివేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏసీబీ 12 ఏండ్ల క్రితం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఇటీవల జస్టిస్ వేణుగోపాల్ ఈ అప్పీల్‌ను కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. కింది కోర్టు తమ తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఎటువంటి ఆస్కారం లేదని స్పష్టం చేశారు.