సామాజిక బాధ్యతగా డ్రగ్స్​ను నిర్మూలిద్దాం : సందీప్ శాండిల్య

సామాజిక బాధ్యతగా డ్రగ్స్​ను నిర్మూలిద్దాం : సందీప్ శాండిల్య
  •     యూత్ , స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
  •     డ్రగ్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది
  •     టీఎస్  న్యాబ్  డైరెక్టర్ సందీప్ శాండిల్య

హైదరాబాద్‌,వెలుగు : డ్రగ్స్‌తో విద్యార్థులు, యువత తమ భవిష్యత్​ను నాశనం చేసుకుంటున్నారని టీఎస్‌ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీఎస్‌ న్యాబ్‌) డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని పేర్కొన్నారు. డ్రగ్స్‌, గంజాయి లాంటి మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు సామాజిక బాధ్యతగా కలిసికట్టుగా రావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘యాంటీ డ్రగ్‌ సమ్మిట్‌–2024’ అంశంపై మేడ్చల్‌ జిల్లా శామీర్‌‌పేట్‌లోని బిట్స్‌ పిలానీ క్యాంపస్‌లో శనివారం సదస్సు జరిగింది. 

రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌, రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు తలపెట్టిన సామాజిక ఉద్యమంలో విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.  డ్రగ్స్‌, గంజాయిపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, వాటికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని రాచకొండ సీపీ సుధీర్‌‌బాబు సూచించారు.  విద్యార్థులు, యువత పోలీసులకు సహకరించాలని, కాలేజీలు, హాస్టళ్లలో అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

డ్రగ్ చైన్‌ను నాశనం చేయడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జీవితంలో విజయాలు సాధించాలంటే డ్రగ్స్, గంజాయి లాంటి ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సైబరాబాద్ సీపీ అవినాష్‌ మహంతి సూచించారు. తన బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ శర్మ సక్సెస్ స్టోరీ గురించి ఆయన వివరించారు. అనంతరం డ్రగ్స్‌పై విద్యార్థుల్లో అవగాహన కల్పించే  పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సదస్సులో యూఎస్ కాన్సులెట్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఎరిన్ ఫిషర్, డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.