
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని విమర్శించారు. సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. డీఎంకే నేతలు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ వారిని ఎందుకు అదుపు చేయడం లేదన్నారు. ఇండియా కూటమిలోని డీఎంకే నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరి ఏంటో రాహుల్ గాంధీ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ గాంధీ మౌనం వీడి తన స్పందన తెలపాలన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్య పెట్టడమని విమర్శించారు. తెలంగాణలో హామీల అమలుకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరికొంత సమయమిస్తామని పేర్కొన్నారు. తగిన సమయంలోగా హామీలను అమలు చేయకపోతే కచ్చితంగా పోరాటం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాగా, కొన్ని రోజుల క్రితం ఓ డీఏంకే నేత మాట్లాడుతూ.. బీహార్, ఉత్తర్ ప్రదేశ్ నుంచి హిందీ మాట్లాడే వారు తమిళనాడుకు వచ్చి టాయిలెట్లు కడుగుతున్నారని వివాదస్పద కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.