నేను దుబాయ్‌‌లో ఉన్నా.. హత్యతో సంబంధంలేదు.. హాదీ హత్య కేసు నిందితుడు వెల్లడి

నేను దుబాయ్‌‌లో ఉన్నా.. హత్యతో సంబంధంలేదు.. హాదీ హత్య కేసు నిందితుడు వెల్లడి
  • కావాలనే ఇరికించారని ఆరోపణ
  • వీడియో రిలీజ్ చేసిన ఫైసల్​ కరీం

ఢాకా: తాను దుబాయ్‌‌లో ఉన్నానని బంగ్లాదేశ్‌‌ స్టూడెంట్​ లీడర్‌‌‌‌ ఉస్మాన్​ హాదీ హత్య కేసు నిందితుడు ఫైసల్‌‌ కరీం మసూద్ తెలిపాడు. హాదీ హత్యతో తనకు సంబంధంలేదని స్పష్టం చేశాడు. బుధవారం ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశాడు. హాదీ మర్డర్‌‌‌‌ వెనుక ఓ రాడికల్‌‌ పొలిటికల్‌‌ గ్రూప్‌‌ ఉన్నదని ఆరోపించాడు. కాల్పులకు ముందు తాను హాదీ కార్యాలయానికి వెళ్లింది నిజమేనని మసూద్ అంగీకరించాడు. కానీ ఇంక్విలాబ్ మోంచో ప్రతినిధితో తన సంబంధం పూర్తిగా వ్యాపారపరమైనదని వెల్లడించాడు. ‘‘నన్ను కావాలనే ఈ కేసులో ఇరికించారు. దీని నుంచి  రక్షించుకునేందుకు దుబాయ్‌‌కు వెళ్లిపోయా. 

హాదీ జమాతే నుంచి వచ్చిన నాయకుడు. జమాతే ఇస్లామీ పార్టీ విద్యార్థి విభాగానికి చెందిన వ్యక్తులకు హత్యలో ప్రమేయం ఉంది. హాదీతో నాకు వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ కాంట్రాక్ట్‌‌లు దక్కించుకోవడం కోసం హాదీ రాజకీయ కార్యకలాపాలకు నేను విరాళాలు ఇచ్చా”  అని వివరించాడు. ఈ కేసులో తమను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని ఫైసల్​ తెలిపాడు. తన కుటుంబాన్ని అన్యాయంగా ఇందులోకి లాగుతున్నారని, ఇలాంటి వేధింపుల స్థాయి చాలా ఆందోళనకరం, అమానవీయం అని పేర్కొన్నాడు.

నిందితులు భారత్‌‌లో ఉన్నారు: బంగ్లా ఆరోపణలు

హాదీ హత్య తర్వాత అనుమానితులు దేశం విడిచి పారిపోయారని బంగ్లాదేశ్‌‌ పోలీసులు పేర్కొన్నారు. నిందితులు ఫైసల్ కరీమ్ మసూద్, ఆలంగీర్ షేక్ అనే ఇద్దరు వ్యక్తులు బంగ్లాదేశ్ నుండి తప్పించుకుని మేఘాలయ సరిహద్దు ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారని ఆరోపించారు. అయితే,ఈ ప్రకటనను భారత భద్రతాధికారులు ఖండించారు.