
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ యాంటీ లవ్ జీహాద్ బిల్లుకు ఆమోదం తెలిపింది. యూపీ మంత్రి సురేష్ కన్నా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ‘లవ్ జీహాద్’ పేరుతో కుట్ర పన్ని బలవంతంగా మత మార్పిడికి యత్నిస్తే 20 ఏళ్ల జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తామని యోగి సర్కార్ స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ‘లవ్ జీహాద్’కు పాల్పడితే రూ.50 వేల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష ఉండేది. కానీ.. ఇకపై మరింత కఠినంగా వ్యవహరించాలని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ నిర్ణయించారు. అందుకే.. యాంటీ లవ్ జీహాద్ బిల్లులో శిక్షా కాలం పెంచుతూ సవరణలు చేసి అసెంబ్లీలో ఆమోదింపజేసుకున్నారు.
‘లవ్ జీహాద్’కు పాల్పడినట్లు ఇన్నాళ్లూ నేరుగా బాధితులు గానీ, బాధిత కుటుంబం గానీ ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు ఈ నిబంధనలో కూడా సవరణ చేశారు. బలవంతపు మత మార్పిడులపై ఇకపై ఎవరైనా ఫిర్యాదు చేసేలా చట్టంలో మార్పులు చేశారు. పోలీసులకు లిఖితపూర్వకంగా కన్వర్షన్లపై ఫిర్యాదు చేయవచ్చు. ‘లవ్ జీహాద్’ కేసులను నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Also read : కేరళలో రైలును ఆపి వందల మంది ప్రాణాలు కాపాడిన వాచ్మెన్.. వీడియో ఇదే..
యాంటీ లవ్ జీహాద్ బిల్లుకు సంబంధించిన ఆర్డినెన్స్ నవంబర్ 2020న విడుదల చేశారు. ఇప్పుడు అసెంబ్లీ ఆమోదంతో యాంటీ లవ్ జీహాద్ చట్టం-- 2021 తక్షణమే ఉత్తరప్రదేశ్లో అమల్లోకి రానుంది. హిందూ యువతులను ప్రేమ ముసుగులో వివాహం చేసుకుని ముస్లిం మతంలోకి మార్చే కుట్ర భారత్లో జరుగుతోందని బీజేపీ కొన్నేళ్ల నుంచి ఆరోపిస్తోంది. ‘లవ్ జీహాద్’లో భాగంగా ఇలా ఎంతోమంది హిందూ యువతులను బలవంతపు మత మార్పిడులకు పాల్పడి ముస్లిం మతంలోకి మార్చేశారని.. ఇకపై సహించేది లేదని యోగి సర్కార్ కుండబద్ధలు కొట్టి మరీ చెబుతోంది. ‘లవ్ జీహాద్’కు పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే యాంటీ లవ్ జీహాద్ బిల్లుకు తాజాగా యూపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.