
న్యూఢిల్లీ: కరోనా వైరస్ గుట్టు తేల్చేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) మరో కొత్త టెస్ట్ కు శ్రీకారం చుట్టింది. కొవిడ్ కు సంబంధించి ప్రపంచంలోనే తొలిసారిగా పెద్ద ఎత్తున యాంటీబాడీ టెస్టులు చేయనున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
ఏమిటీ టెస్ట్?
ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చినవారు, వారితో కాంటాక్ట్ అయినవారు, జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తున్న వారికి కరోనా వైరస్ సోకిందా? లేదా?అన్నది తేల్చేందుకు ముక్కు లేదా గొంతు నుంచి శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేస్తున్నారు. అయితే, దేశంలో కరోనా వైరస్ ఇంతకుముందే ఎవరికైనా సోకిందా? ఎలాంటి లక్షణాలు కన్పించకుండా వారికి సహజంగానే వైరస్ తగ్గిపోయిందా? అన్నది యాంటీబాడీ టెస్టులో తేలుతుంది. ఒకవేళ కరోనా వైరస్ ఇంతకుముందు ఎవరికైనా సోకి దానంతట అదే తగ్గిపోతే, వారి రక్తంలో వైరస్ ను నాశనం చేసేందుకు తయారైన యాంటీబాడీలు ఉంటాయి. ఈ టెస్టు ద్వారా ఆ యాంటీబాడీలను గుర్తిస్తే.. వైరస్ పనితీరు, దానిని అంతం చేసేందుకు ఉన్న అవకాశాల గురించి తెలుసుకోవచ్చు. రక్తంలో యాంటీబాడీలను గుర్తించే ఈ పరీక్షను సీరాలజీ టెస్ట్ అని కూడా పేర్కొంటారు.
ఎవరికి చేస్తారు?
ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినవారితో కాంటాక్ట్ అయిన ఇతరులకు ఈ యాంటీబాడీ టెస్టులు చేస్తామని ఐసీఎంఆర్ నియమించిన హైలెవల్ కమిటీ కమిటీ చైర్మన్ రణదీప్ గులేరియా వెల్లడించారు. దీనివల్ల స్వల్ప ఇన్ఫెక్షన్ సోకినవారు, సహజంగా కోలుకున్న వారిని గుర్తించొచ్చని, వారి యాంటీబాడీలను బట్టి ఇన్ఫెక్షన్ తీరును అర్థం చేసుకోవచ్చని కమిటీలోని ఆయన వివరించారు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా, వ్యక్తులకు ఈ వైరస్ ఇంతకుముందు సోకిందా? లేదా? అన్నది ఈ టెస్టులో తెలుస్తుందన్నారు. ఇప్పటివరకూ ఈ వైరస్ పై నిఘా పెట్టేందుకు యాంటీబాడీ టెస్టుల డేటా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
For More News..