పీవీ సింధు సాధించిన ట్రోఫీలు చూసి షాకైన బాలీవుడ్ నటుడు

పీవీ సింధు సాధించిన ట్రోఫీలు చూసి షాకైన బాలీవుడ్ నటుడు

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును కలిశారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి ఉన్న కొన్ని క్షణాలను ట్వి్ట్టర్ వేదికగా పంచుకున్నారు. హైదరాబాద్ లోని సింధు నివాసానికి వెళ్లిన అనుపమ్‌... ఆమె సాధించిన అవార్డు, ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలను చూసి ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయన తన అకౌంట్లో పోస్ట్ చేశారు. సింధు సైతం అనుపమ్ తో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇక అనుపమ్ షేర్ చేసిన ఈ వీడియోలో సింధు చిన్నప్పటి నుంచి సాధించిన మెడల్స్, అవార్డ్స్ ను చూపిస్తూ షట్లర్ సింధుపై ప్రశంసలు కురిపించారు. అండర్‌-13 టోర్నమెంట్ల నుంచి ఒలింపిక్స్‌ దాకా సింధు సాధించిన విజయాలను కొనియాడుతూ మనకు స్ఫూర్తిని కలిగించే నిజమైన హీరో అంటూ కీర్తించారు. 

ఇటీవల తనకు బ్యాడ్మింటన్‌ ఛాంపియన్ పీవీ సింధు ఇంటికి వెళ్లే అవకాశం లభించిందని అనుపమ్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. 8 ఏళ్ల వయస్సు నుంచి సింధు సాధించిన విజయాలు, అవార్డులు ట్రోఫీల గురించి ఆమెను అడిగి తెలుసుకున్నానని, సింధు వినయానికి తాను పూర్తిగా బౌల్డ్‌ అయ్యానన్నారు. ఆమే మనకు స్ఫూర్తి కలిగించే నిజమైన హీరో అని ప్రశంసించారు. ఈ సందర్భంలో సింధు సాధించిన ట్రోఫీలను చూపిస్తూ ఉండగా..  సింధు వన్ అండ్ ఓన్లీ ఛాంపియన్ అంటూ తెగ పొగిడారు. తన గోడపై ఉన్న అవార్డ్స్ చూసి ఎప్పుడూ గర్వపడేవాడినని.. కానీ ఇక్కడ అలాంటివి చాలా ఉన్నాయని చెప్పారు. ఇది చాలా అద్భుతమైందన్న ఆయన... ఓ మై గాడ్.. ఇక్కడ అస్సలు ఖాళీ లేదుగా నవ్వుతూ వీడియోలో మాట్లాడారు.