Paradha Review: ‘పరదా’ రివ్యూ.. స్త్రీ అస్తిత్వంపై అనుపమ పరమేశ్వరన్ మూవీ

Paradha Review: ‘పరదా’ రివ్యూ.. స్త్రీ అస్తిత్వంపై అనుపమ పరమేశ్వరన్ మూవీ

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పరదా’(Paradha). ఇవాళ (ఆగస్టు 22న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా బండి మూవీతో ఎంతో పేరు తెచ్చుకున్న ప్రవీణ్ కండ్రేగుల పరదా తెరకెక్కించారు. ఇందులో అనుపమతో పాటు దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రల్లో నటించారు. గోపీ సుందర్‌ సంగీతం అందించారు.

అయితే, ఈ సినిమా ప్రీమియర్స్‌ను రెండు రోజుల ముందే ప్రదర్శించారు దర్శక నిర్మాతలు. అంటే, ఈ సినిమా కథపై తమకున్న కాన్ఫిడెంట్ ఏంటనేది మేకర్స్ నిరూపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి నేడు థియేటర్స్ లోకి వచ్చిన పరదా ఎలా ఉంది? మేకర్స్ అంచనాలు నిజమయ్యే కథ, కథనాలు ఉన్నాయా? లేదా? అనేది కంప్లీట్ రివ్యూలో తెలుసుకుందాం.  

కథేంటంటే:

ఆంధ్రప్రదేశ్‌లోని ‘పడతి’ అనే చీకటి ఆచారాలు పాటించే ఓ గ్రామం. అక్కడ పుట్టి పెరిగిన అమ్మాయిలు తమ ముఖానికి పరదా కప్పుకునే ఉండాలి. ఒకవేళ పొరపాటున పరదా తీసి కనిపిస్తే గ్రామపెద్దలు తమ కట్టుబాట్లతోనే సగం చంపేస్తారు. ఒకవేళ తప్పు రుజువుచేసుకోలేకపోతే, ఆ ఊరి దేవత జ్వాలమ్మకు ఆహుతి ఇచ్చి మొత్తానికే చంపేస్తారు. ఇదే ఆ గ్రామ చీకటి ఆచారం.

అయితే, అదే గ్రామంలో ఉన్న సుబ్బు (అనుపమ), రాజేష్ (రాగ్ మయూర్) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. వీరి పెళ్ళికి పెద్దలు సైతం ఒప్పుకుంటారు. కానీ, అనుకోకుండా సుబ్బు పరదా లేకుండా ఉన్న ఓ ఫోటో ఒక పెద్ద మ్యాగజైన్‌లో కనిపిస్తుంది. ఆ వెంటనే ఊరి ప్రజలు ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంటారు. ఈ క్రమంలో సుబ్బు పరదా తీసిందని, ఆత్మార్పణ చేసుకోవాల్సిందే అని ఊరి ప్రజలు తీర్మానం చేస్తారు.

ఇక ఇలాంటి సమయంలో సుబ్బు పయనం ఎటూ సాగింది? రత్న (సంగీత), అమిష్ట (దర్శన రాజేంద్రన్)లు సుబ్బుకి ఎందుకు తోడుగా నిలుస్తారు? అసలు పడతి గ్రామంలో అమ్మాయిలు పరదా ఎందుకు ధరించాలి? సుబ్బు పరదా తీసి నిజంగానే తప్పు చేసిందా? పడతి గ్రామంలో శ్రీ జ్వాలాంబికా ఆలయం ప్రత్యేకత ఏమిటి? అనే తదితర విషయాలు తెలియాలంటే మూవీ థియేటర్స్లో చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

మహిళా సాధికారతపై నడిచే సినిమా ఇది. ఇంకా చెప్పాలంటే స్త్రీ అస్తిత్వంపై సాగిన కథ ఇది. తెలుగులో మహిళా ప్రాధాన్యత సినిమాలు ఐదేళ్లకు ఓ రెండు సినిమాలైన వస్తుంటాయి. అవి తెరపైకి వచ్చి ఒక మార్క్ని చూపించి చరిత్రని చెప్పి వెళ్తాయి. అంతేకాదు.. అందులో ఉన్న కథ ప్రేక్షకులను ఆలోచనలో పడేలా చేస్తాయి. అలా ఈ ఏడాది తెరపైకి వచ్చిన అరుదైన కథే... ‘పరదా’. 

ఈ సినిమా ద్వారా మహిళల పట్ల సమాజంలో నెలకొన్న ద్వంద్వ ప్రమాణాలు, వారు ఎదుర్కొంటున్న సవాళ్లు కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖానికి పరదా వేసుకునే కథ, సుబ్బు ప్రేమ, నిశ్చితార్థం, ధర్మశాలకు వెళ్లే పయనం ఈ అంశాలతో సినిమా కథనం రాసుకున్నారు దర్శకుడు ప్రవీణ్. మూఢ నమ్మకాలు, ఆచారం, సంప్రదాయం వంటి వాటితో ఇప్పటికీ చాలా చోట్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఓ సాహసోపేతమైన సబ్జెక్టు తో వచ్చి దర్శకుడు ప్రవీణ్ సక్సెస్ అయ్యాడు.

సినిమా కథ పరంగా చూసుకుంటే.. చాలా చిన్నదే. కానీ, అందులో ఉన్న కథనం పెద్దది. పరదా అనే ఒక ఆచారాన్ని పాటిస్తూ వస్తున్న గ్రామానికి చెందిన ఓ యువతి, ఆ పరదా తమను కాపాడలేదని విషయం తెలిసి, ఆ విషయాన్ని గ్రామస్తులకు ఎలా ప్రూవ్ చేసింది అనేది సినిమా స్టోరీ.

అయితే, ఫస్టాఫ్ మొత్తం సినిమా కథ వెనుక ఉన్న నేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు డైరెక్టర్ ప్రవీణ్. పరదా తీస్తే ఆత్మాహుతి చేసుకోవడం అనే కఠినమైన నిబంధన ఎలా ఉంటుందనేది చక్కగా అర్ధమయ్యేలా చెప్పుకొచ్చాడు.

ALSO READ :  'బిగ్ బాస్ 19'లో హౌస్ లోకి మైక్ టైసన్, ది అండర్‌టేకర్ ?

కానీ, సెకండాఫ్లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ధర్మ‌శాల‌కు వెళ్లే అనుపమ జర్నీలో వచ్చే సీన్స్.. ఓక విహార‌యాత్ర డాక్యుమెంటేష‌న్‌లా ఉండటం నిరాశ కలిగిస్తుంది. ఏదేమైనా ఆచారం, సాంప్రదాయల కారణంగా మహిళలు ఎలా అణగారిపోయారో చెప్తూనే, అమ్మాయిలు భయాన్ని వదిలేసి ధైర్యంగా బతకాలని చెప్పే స్ఫూర్తివంతమైన సినిమా ఇది.

ఎవరెలా చేశారంటే:

అనుపమ పరమేశ్వరన్ పోషించిన సుబ్బు పాత్రకు వందశాతం న్యాయం చేసింది. ఈ పాత్రకు అనుపమ తప్ప మరెవ్వరు న్యాయం చేయలేరనేలా నటించింది. సుబ్బు పాత్రలో ఎక్కువ శాతం పరదాలోనే ఉన్నప్పటికీ.. తన బాడీ లాంగ్వేజ్‌తో, డైలాగ్స్‌తో ఆకట్టుకునేలా చేసింది.

దర్శన రాజేంద్రన్ పాత్ర కొద్దిసేపు అయినప్పటికీ ఇంపాక్ట్ కలిగించేలా నటించింది. సుబ్బుని ప్రభావితం చేసే పాత్రలో దర్శన పాత్ర ఆకట్టుకుంటుంది. సంగీత తనదైన నటనతో సినిమాకు మరో హైలెట్ గా నిలిచింది. రాగ్ మయూర్, 'బలగం' సుధాకర్ రెడ్డి తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. మిగతా క్యారెక్టర్స్ సైతం సినిమాకు న్యాయం చేసేలా నటించారు.

సాంకేతిక అంశాలు:

తెరపై సినిమా కళ్ళకు కట్టినట్లుగా సహజ సిద్ధంగా రావడానికి ముఖ్య కారణం ' టెక్నీకల్' టీమ్. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. ఇందులో భాగంగా మృదుల్‌ సుజిత్‌ సేన్‌ సినిమాటోగ్రఫీ చాలా నేచురల్గా ఉంది. తన కెమెరాతో సినిమాను ఉన్నతంగా మలిచారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ సినిమాకు న్యాయం చేసింది. గోపీసుంద‌ర్ సంగీతం.. సినిమాకి ప్రాణం పోసింది.

పూజిత శ్రీకంటి, ప్రహాస్‌ బొప్పుడి రాసుకున్న పరదా కథ ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేసింది. చివరగా డైరెక్టర్ ప్రవీణ్‌ కండ్రేగుల.. గతంలో సినిమా బండి, శుభం సినిమాలు తీసి ఆకట్టుకున్నారు. కానీ, ఈ సినిమా కోసం మాత్రం చాలా రీసెర్చ్ చేసి తెరకెక్కించారు. మహిళల ఆలోచనలను ప్రతిబింబించే విధంగా ప్రతి ఒక్క విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు.