ఎపిసోడ్​కు మూడు లక్షల పారితోషికం

ఎపిసోడ్​కు మూడు లక్షల పారితోషికం

రూపాలి గంగూలీ.. హిందీ టెలివిజన్​ నటి​. వయసు నలభై నాలుగేండ్లు. రెమ్యూనరేషన్​ అక్షరాల మూడు లక్షలు. వారానికో, నెలకో కాదు కేవలం ఒక్క ఎపిసోడ్​కి. అది కూడా ముగ్గురు పిల్లల తల్లి క్యారెక్టర్​ చేస్తున్నందుకు. పైగా అందులో ఇద్దరి పిల్లల వయసు పాతికేండ్లకి పైనే ఉంది. అయితే కచ్చితంగా ఏదో స్టార్​ ఫ్యామిలీలో మెంబర్ అనుకుంటే పొరపాటే. కేవలం రూపాలి యాక్టింగ్​ స్కిల్స్​ తనని ఇండియన్​ టెలివిజన్​లోనే హయ్యెస్ట్​​  రెమ్యునరేషన్​  తీసుకుంటున్న  స్టార్​గా నిలబెట్టాయి. ఎలాంటి సీన్​ అయినా తన కళ్లతోనే ఎక్స్​ప్రెషన్స్​​ పలికించే రూపాలీ రియల్​​ కథ ఇది.

‘అనుపమ..’ హిందీ స్టార్​ ప్లస్​లో జులై 13, 2020 న  ఎలాంటి ఎక్స్​పెక్టేషన్స్​ లేకుండా లాంఛ్​ అయిన సీరియల్​. సినిమాలకి ఏమాత్రం తీసిపోని హిందీ సీరియల్​​ కథల్లో ఇదొక ప్రయోగం. పెద్దగా చదువుకోలేదని తల్లిని తక్కువ చేసే పెద్దకొడుకు, కూతురు. కోడలిని వంటింటి కుందేలుగానే చూడాలనుకుంటుంది అత్త. భార్యని చిన్నచూపు చూసే భర్త.. పైగా అతని జీవితంలో మరో అమ్మాయి. వీటన్నింటి మధ్య తనకిష్టమైన డాన్స్​ని వదిలేసి నలిగిపోయే హౌస్​వైఫ్​ కథే ఈ సీరియల్​. ఇలాంటి కాన్సెప్ట్​తో ఇంతకుముందూ సీరియల్స్​ వచ్చాయి. కానీ, వాటన్నింటికీ ఇది పూర్తి డిఫరెంట్​. అలా అనుపమ క్యారెక్టర్​ని మలిచాడు డైరెక్టర్​. ఆత్మాభిమానంతో తన ఇరవై ఐదేండ్ల పెండ్లి బంధాన్ని తెంచుకోవడానికి ఆమె పడే సంఘర్షణ. దాన్నుంచి బయటికొచ్చి ఆమె సాధించిన విజయాలు చాలామందికి సెల్ఫ్​ కాన్ఫిడెన్స్​ ఇస్తాయి. అనుపమ క్యారెక్టర్​  ‘విడాకులపై’ ఉన్న తప్పుడు అభిప్రాయాల్ని ప్రశ్నిస్తుంది కూడా. అందుకే టీఆర్పీలో దూసుకెళ్తోంది ఈ సీరియల్. అయితే కథ ఎంత అద్భుతంగా రాసుకున్నా..దాన్ని జనాలకి కనెక్ట్​ చేయాల్సిన బాధ్యత నటీనటులదే. ఆ విషయంలో రూపాలి మెచ్చుకోవాల్సిందే.   

నాలుగేండ్లకే నటించి..

రూపాలి గంగూలీ తండ్రి అనిల్​ గంగూలీ 1970– 1990 ల్లో  ఎన్నో సూపర్​ హిట్​ బాలీవుడ్​ సినిమాల్ని డైరెక్ట్​ చేశాడు. స్ర్కీన్​ రైటర్​గానూ  మంచి పేరు తెచ్చుకున్నాడు. దాంతో చిన్నప్పట్నించీ ఇండస్ట్రీపై ఒక అవగాహన ఉంది రూపాలికి. తండ్రితో కలిసి షూటింగ్స్​కి వెళ్లడం వల్ల యాక్టింగ్​పైనా ఇంట్రెస్ట్​ వచ్చింది ఆమెకి. కానీ, వీటన్నింటికన్నా ముందు నాలుగేండ్ల వయసులోనే  తండ్రి డైరెక్షన్​లో ఒక చిన్న రోల్​ చేసింది. ఏడేండ్ల వయసులో ‘ సాహెబ్​’  ఫిల్మ్​తో చైల్డ్ ఆర్టిస్ట్​గా అందరి మనసూ దోచుకుంది. పదమూడేండ్లకే బెంగాలీ సూపర్​ హిట్​ సినిమా ‘బలిదాన్’ ​లోనూ హీరోయిన్​గా ఛాన్స్​ కొట్టేసింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ.. చదువుపై కాన్సన్​ట్రేట్​ చేయాలనుకుంది. దానికి కారణం తండ్రి అనిల్​ గంగూలీ. 

పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కానీ, బిజీ షెడ్యూల్స్​ వల్ల  రూపాలి చదువు డిస్టర్బ్​ అయింది. దాంతో చదువా? యాక్టింగా? అన్న సందిగ్ధంలో పడింది. ఆ టైంలో రూపాలి తండ్రి ‘యాక్టింగ్ వైరస్​ లాంటిది..అది అంత ఈజీగా వదలదు. కొన్నాళ్లు బ్రేక్​ తీసుకో, గ్రాడ్యుయేషన్​ తర్వాత యాక్టింగ్​ వైపు వెళ్ల’ మని చెప్పాడట. దాంతో యాక్టింగ్​ని పక్కనపెట్టి కాన్సన్​ట్రేషన్​ అంతా చదువుపైనే పెట్టింది రూపాలి. హోటల్​ మేనేజ్​మెంట్ పూర్తిచేసింది. థియేటర్​ ఆర్ట్స్​ కూడా చేసింది. ​ఆ తరువాత మోడలింగ్​లో అడుగుపెట్టింది. 

మోడలింగ్​లో..

కమర్షియల్​ యాడ్స్​లో రూపాలిని చూసి 2000 వ సంవత్సరంలో ‘సుకన్య’ సీరియల్​ టీమ్​ అప్రోచ్​ అయింది. ఆ తర్వాతి రెండేళ్లకి ‘దిల్​ హై కి మాన్తా నహీ’ సీరియల్​లో డ్యూయెల్​ రోల్​ చేసే అవకాశం వచ్చిందామెకి. ‘జిందగీ,  తేరి మేరి కహానీ’ సీరియల్స్​లోనూ మెయిన్​ లీడ్​గా చేసింది. కానీ, ఆ సీరియల్స్​ పెద్దగా నడవకపోవడంతో రూపాలికి గుర్తింపు రాలేదు. పైగా రానురాను పాజిటివ్​ క్యారెక్టర్స్​ బోర్ అనిపించాయి ఆమెకి. దాంతో నెగెటివ్​ షేడ్స్​ ఉన్న క్యారెక్టర్స్​ వైపు అడుగులేసింది. అలా హిందీ ఆల్​ టైం సూపర్​ హిట్​ సీరియల్​ ‘సంజీవని’లో ఆమె చేసిన  సిమ్రన్​ క్యారెక్టర్​  బాగా హిట్​ అయింది. ఆ క్యారెక్టర్​కిగాను ఇండియన్ టెలీ అవార్డ్స్​కి కూడా నామినేట్​ అయింది రూపాలి. ఆ తరువాత తన కెరీర్​ని మలుపు తిప్పిన మరో  క్యారెక్టర్​ ‘ సారాభాయ్​ వర్సెస్​ సారాభాయ్​’ సీరియల్​లోని మోనీష​. మోనీష పాత్రలో రూపాలి చేసిన కామెడీ చిన్నాపెద్దా అందర్నీ టీవీలకి అతుక్కుపోయేలా చేసింది. దాంతో  మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి. ఆ సీరియల్​ సెకండ్​ సీజన్​లోనూ రూపాలి నటించింది. ఆ తరువాత పెండ్లి చేసుకొని, యాక్టింగ్​కి బ్రేక్​ వేసింది. 

రియాలిటీ షోల్లో...

హిందీ బిగ్​బాస్ సీజన్–1లో పార్టిసిపేట్​ చేసి టాప్​–5 వరకు చేరుకుంది. ఆ తర్వాత ‘జరా నాచ్​కే దిఖా’ అనే డాన్స్​ రియాలిటీ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. ‘ఖత్రోంఖి ఖిలాడీ’ సీజన్–2లోనూ  రిస్కీ ఫీట్​లతో అలరించింది. ‘కిచెన్​ ఛాంపియన్​–2’, ‘మీతీ చూరీ నెంబర్–1’ షోల్లో కంటెస్టెంట్​గా, ‘బిగ్​కోప్’​ అనే షోలో హోస్ట్​గానూ మెప్పించింది రూపాలి.

పన్నెండేండ్ల స్నేహం.. 

రూపాలి తన  కెరీర్​ స్టార్టింగ్​లో  అశ్విన్​ కే వర్మ డైరెక్ట్​ చేసిన ఒక యాడ్​లో నటించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు అశ్విన్​ యూఎస్​ వెళ్లి , అక్కడే సెటిలయ్యాడు. కానీ, వాళ్ల పరిచయం కొన్నాళ్లకి స్నేహంగా మారింది. అలా పన్నెండేండ్లు స్నేహితులుగా ఒకరినొకరు అర్థం చేసుకున్నాక పెండ్లికి రెడీ అయ్యారు. పెండ్లి తర్వాత  అశ్విన్​ రూపాలి కోసం జాబ్​ని వదిలేసి ముంబై షిఫ్ట్​ అయ్యాడు. ‘నా కాన్ఫిడెంట్​, ఫిలాసఫర్​, గైడ్​ అన్నీ నా భర్తే’ అంటుంది రూపాలి. అయితే , పెండ్లి తర్వాత దాదాపు ఏడేండ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంది రూపాలి. కొడుకు పుట్టాక, యాక్టింగ్​ వైపు రావాలన్న ఆలోచననే మర్చిపోయిందట. ఆ టైంలోనే బెంగాలీ షో​ ‘ఇంద్రాణి హైదర్స్’కి ​ రీమేక్​గా వస్తున్న ‘అనుపమ’ కథ విని, మొదట వద్దనుకున్నా.. భర్త కన్విన్స్​ చేయడంతో అనుపమగా అందరి ముందుకొచ్చింది. ఈ సీరియల్​లోని ప్రతీ సీన్​ని తన నేచురల్​ యాక్టింగ్​తో ప్రాణం పోసింది. కథక్​ డాన్సర్​గానూ మంచి మార్కులు వేయించుకుంది.