
పవర్‌ఫుల్‌గా ఉంటూనే డిఫరెంట్ షేడ్‌తో ఉండే ‘శీలావతి’ క్యారెక్టర్ తన ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ది బెస్ట్‌గా నిలిచిపోతుందనే నమ్మకం ఉందని అనుష్క చెప్పింది. ఆమె లీడ్ రోల్‌లో క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం (సెప్టెంబర్ 05) ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా అనుష్క ఇలా ముచ్చటించింది.
మహిళలు పైకి సున్నితంగా కనిపిస్తున్నప్పటికీ ఏదైనా గడ్డు పరిస్థితి ఎదురైనప్పుడు ఒక బలమైన పిల్లర్‌గా నిలబడతారు. మహిళల్లో ఉండే గొప్ప క్వాలిటీ అది. క్రిష్ గారు అలాంటి ఒక బలమైన పాత్రని శీలావతిగా తీర్చిదిద్దారు. గతంలో ఎప్పుడూ ఇలా పాత్ర పోషించలేదు. బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకే నా కంఫర్ట్ జోన్‌ను దాటి ఈ సినిమా చేశా.
దర్శకులు క్రిష్, రచయిత శ్రీనివాస్ గార్లు ఈ కథ చెప్పినప్పుడు తూర్పు కనుమల్లోని కల్చర్ నాకు ఆసక్తిగా అనిపించింది. లొకేషన్స్‌కు వెళ్లి చూశాక కొత్త పాత్రలు, కొత్త కల్చర్, కొత్త తరహా విజువల్స్‌ను ప్రేక్షకులకు చూపించబోతున్నామనే ఎక్సైట్‌మెంట్ కలిగింది. అలాగే క్రిష్ ఎప్పుడూ సోషల్‌గా రెలెవెంట్ ఉండే స్టోరీస్ ఎంచుకుంటారు. ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్ అయినప్పటికీ డ్రగ్స్ అనే సీరియస్ ఇష్యూపై సినిమా. ఇందులో పాజిటివ్ మెసేజ్ కూడా ఉంది.
నేను చేసిన సినిమాల్లో చాలా వరకూ హార్డ్ వర్క్‌తో కూడుకున్నవే. ‘ఘాటి’లోనూ ఫిజికల్‌గా హార్డ్ వర్క్ ఎక్కువ ఉంది. అయితే ఇలాంటి కొత్త లొకేషన్స్‌లో షూటింగ్ చేయడం ఎక్సైటింగ్‌గా అనిపించింది. పైగా క్రిష్ షూటింగ్‌ను చాలా బాగా ప్లాన్ చేశారు. దీంతో షూటింగ్ నాకొక మెమొరబుల్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలిచింది ఇలాంటి ఓ డిఫరెంట్ సబ్జెక్ట్‌ను నమ్మి నాపై నమ్మకంతో ఇంత గ్రాండ్‌గా నిర్మించిన నిర్మాతలు రాజీవ్ రెడ్డి గారికి, యువి క్రియేషన్స్‌కి థ్యాంక్స్.
ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తున్నా. అదే నా ఫస్ట్ మలయాళం మూవీ. అలాగే తెలుగులో ఓ కొత్త సినిమా చేయబోతున్నా. చాలా ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్. త్వరలోనే అనౌన్స్‌మెంట్ ఉంటుంది. ఇక కెరీర్‌లో ఎప్పటికైనా అవుట్ అండ్ అవుట్ నెగెటివ్ క్యారెక్టర్ చేయాలని ఉంది. పవర్‌ఫుల్ క్యారెక్టర్ కుదిరితే కచ్చితంగా నెగిటివ్ రోల్ చేస్తా. ఇక ఖాళీ సమయాల్లో ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటా. అలాగే సినిమాలు చూస్తుంటా. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా. గత రెండేళ్లుగా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపాను.
ఒక మంచి సినిమా చేస్తే ప్రపంచం నలుమూలల నుంచి గుర్తింపు దొరుకుతుంది. ఇది పవర్ ఆఫ్ సినిమాగా భావిస్తున్నాను. ‘బాహుబలి’ లాంటి చిత్రంతో రాజమౌళి గారు అద్భుతంగా ప్రజెంట్ చేయడం వలనే నన్ను చూడ్డానికి రిమోట్ ఏరియాలో కూడా జనం వచ్చారు. అలాగే ‘అరుంధతి’ మొదలు ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాత్రలు ఇచ్చిన దర్శకనిర్మాతలకు ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నా.