
అనుష్కాశర్మ అందరికీ మొదట నటిగానే తెలుసు. అయితే స్టార్ హీరోయిన్ అయ్యాక ప్రొడ్యూసర్‌గానూ మారిందామె. కానీ ఇప్పుడు తనకి నటనంటేనే ఎక్కువ ఇష్టమని, దాని తర్వాతే ఏదైనా అంటోంది. 2013లో తన తమ్ముడు కర్ణేష్ శర్మతో కలిసి క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ అనే బ్యానర్‌ను స్థాపించింది అనుష్క. కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీసులు కూడా నిర్మించి సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నప్పుడు ప్రొడ్యూసర్‌గా ఎంతో యాక్టివ్‌గా ఉంది. అయితే నాలుగేళ్ల తర్వాత మళ్లీ నటనపై దృష్టి పెట్టిన ఆమె.. ఇప్పుడు నిర్మాత బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ‘ఎక్కడున్నా, ఏం చేసినా నా ఫస్ట్ లవ్ మాత్రం యాక్టింగే. అందుకే ఇక దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నాను. విలువలు గల సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్ పెట్టాం. నా తమ్ముడు ఆ బాధ్యతను కరెక్ట్‌గా నిర్వర్తిస్తాడని నా నమ్మకం. అందుకే నేనిక ఎప్పటిలా నటిగానే కంటిన్యూ అవుతాను’ అని కన్‌ఫర్మ్ చేసింది అనుష్క. ప్రస్తుతం ఇండియన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్ ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్’లో నటిస్తోంది. త్వరలో ఆమిర్‌ఖాన్‌తో కలిసి నటించబోతోంది.