
అనుష్క తెరపై కనిపించి రెండున్నరేళ్లు అవుతోంది. ‘నిశ్శబ్దం’ తర్వాత ఆమె నుండి సినిమా రాలేదు. ప్రస్తుతం ఆమె యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తోంది. పి.మహేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. రధన్ సంగీతం అందిస్తున్నాడు. బుధవారం ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్టు ప్రకటించారు. వీళ్లిద్దరి నిజమైన పేర్లు ఈ టైటిల్లో కనిపిస్తున్నాయి. అయితే సినిమా కథ నుండే ఈ టైటిల్‌ను తీసుకున్నామంటున్నారు మేకర్స్. ఇందులో అన్విత రవళి శెట్టి అనే చెఫ్‌గా అనుష్క, సిద్ధు పొలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్‌గా నవీన్ నటిస్తున్నారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన పోస్టర్‌ను బట్టి అనుష్క లండన్‌లో క్లాస్‌గా కనిపిస్తుంటే, నవీన్ హైదరాబాద్ పిట్ట గోడలపై మాస్ లుక్‌లో ఉన్నాడు. అనుష్క చేతిలో ‘హ్యాపీ సింగిల్’ అనే బుక్ ఉండగా, నవీన్ షర్ట్‌పై ‘రెడీ టు మింగిల్’ అని రాసి ఉంది. మరి ఈ ఇద్దరూ ఎక్కడ, ఎలా కలిశారు అనేది ఆసక్తి రేపుతోంది. సమ్మర్‌లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.