యాంగ్జైటీ ఉంటే మెదడు ప్రస్తుతంలో ఉండదు

యాంగ్జైటీ ఉంటే మెదడు ప్రస్తుతంలో ఉండదు

మెదడు నిమిషానికో మారథాన్ పరిగెడుగుతుంటుంది. మనసులో అంతకన్నా వేగంగా భయాలు నిండిపోతాయి. ఆ క్షణమే పట్టరాని కోపం, మరో నిమిషం నిస్సహాయత, వాటన్నింటి మధ్య విలువైన ఈ రోజుని కోల్పోవడం, ఆ తర్వాత అందుకు పశ్చాత్తాపడటం, ఇవన్నీ యాంగ్జైటీ కిందకే వస్తాయి. అలాగని అందరిలోనూ ఇవే లక్షణాలు కనిపించవు అంటోంది క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ స్మిత వాసుదేవ్. దీన్ని డీల్ చేయడానికి మైండ్ పుల్ నెస్ టెక్నిక్స్ చెప్తున్నారామె. 

యాంగ్జైటీ ఉంటే మెదడు ప్రస్తుతంలో ఉండదు. గడిచిన రోజుల చుట్టూ లేదా జరగబోయే వాటి గురించే ఆలోచిస్తుంటుంది. అవసరమైందేదో దొరక లేదని మెదడు సిగ్నల్స్ పంపుతున్నప్పుడు కూడా యాంగ్జైటీ సహజం. ఇది ఎక్కువకాలం ఉంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం, నిద్రలేమి, వణుకు, ఏకాగ్రత దెబ్బతినడం, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. వీటన్నింటి నుంచి బయటపడటానికి మైండ్​ఫుల్​నెస్ టెక్నిక్స్​​ ‘కీ’గా పనిచేస్తాయి అంటున్నారు సైకాలజిస్ట్​లు. వీటిని రోజూ ప్రాక్టీస్​ చేస్తే నెగెటివ్​ ఆలోచనలు రావు. 

  • ఒత్తిడి అనిపించినప్పుడు 5, 4, 3, 2, 1 టెక్నిక్‌‌ ఫాలో అవ్వాలి. ఎలాగంటే... చుట్టూ ఉన్న ఐదు వస్తువుల్ని కళ్లు మూసుకొని గుర్తు తెచ్చుకోవాలి. వాటిల్లో నాలుగు వస్తువుల్ని పట్టుకొని, పేర్లు చెప్పాలి. పరిసరాల్లో వినిపించే మూడు పదాల్ని లేదా శబ్దాల్ని గట్టిగా బయటికి చెప్పాలి. చుట్టు పక్కల మంచి వాసన వచ్చే రెండింటి గురించి మాట్లాడాలి. ఏదైనా ఒక రుచిని గుర్తుతెచ్చుకొని, దాని గురించి చెప్పాలి. 
  • మెదడుని ఆలోచనలు చుట్టుముడుతున్నప్పుడు వెంటనే డైవర్ట్​ చేయాలి. అందుకోసం ఏదైనా వీడియోలు చూడాలి. భూమ్మీద ఉన్న పది అందమైన ప్లేస్​లు లేదా చుట్టుపక్కల ఉన్న​ నగరాలు​, సముద్రాలకి సంబంధించిన వీడియోలు పెట్టుకోవాలి. దానివల్ల మెదడు తేలిగ్గా ఆ ఆలోచనల నుంచి బయటికి వస్తుంది. అలాగే నచ్చిన పాట పెట్టుకొని, పాడాలి. డాన్స్​ చేసినా ఆ ఆలోచనల నుంచి బయటపడొచ్చు. 
  • భయాలు, ఆందోళనల నుంచి మనసు యూటర్న్​ తీసుకోవాలంటే... మంచి సువాసన వచ్చే క్యాండిల్స్​, పర్​ఫ్యూమ్స్​, ఆయిల్స్​ లేదా నచ్చిన పువ్వుని వాసన చూసినా చాలు. సైకలాజికల్​ వెల్​బీయింగ్​ మీద కెవిల్లే, గ్రీన్​ అనే ఇద్దరు వ్యక్తులు చేసిన స్టడీలోనూ ఇదే తేలింది. ఈ స్టడీ ప్రకారం యాపిల్​, సంత్రా​, నిమ్మ​తో తయారైన సెంటెడ్​ క్యాండిల్స్​ వల్ల యాంగ్జైటీ, మూడ్​ స్వింగ్స్​, స్ట్రెస్​.. కంట్రోల్​ అవుతాయి. పువ్వుల వాసన వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. దాంతో మనసుకి ఏం కావాలనే విషయంలో క్లారిటీ వస్తుంది. 
  • నచ్చిన ఫుడ్​ని రుచి చూసినా యాంగ్జైటీ నుంచి బయటపడొచ్చు. ఇష్టమైన వ్యక్తుల్ని దగ్గరకి తీసుకోవడం లేదా నచ్చిన వస్తువుతో కాసేపు ఉండటం వంటివి చేసినా యాంగ్జైటీ నుంచి బయటపడొచ్చు. 

వీటన్నింటితో పాటు ఎవర్ని వాళ్లు ప్రేమించుకోవాలి. దీనివల్ల మెచ్యూరిటీ పెరుగుతుంది. ఎవర్ని వాళ్లు అర్థం చేసుకోగలుగుతారు.  ఎవరి పట్ల వాళ్లు కేర్​​ తీసుకుంటారు. పరిస్థితుల్ని అంగీకరించడం మొదలుపెడతారు.