- మంత్రి సీతక్క బయ్యక్కపేట బాలుర ఆశ్రమ పాఠశాల తనిఖీ
తాడ్వాయి, వెలుగు : ఆశ్రమ పాఠశాలల్లో ఏ సమస్యలు ఉన్నా తనకు గానీ, సంబంధిత ఆఫీసర్లకు గానీ చెబితే వాటిని వెంటనే పరిష్కరిస్తామని మంత్రి సీతక్క చెప్పారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని బయ్యక్కపేట బాలుర ఆశ్రమ పాఠశాలను ఆదివారం ఆమె తనిఖీ చేశారు. వంట గదిని పరిశీలించిన అనంతరం స్టూడెంట్లతో మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న స్టూడెంట్లకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. కష్టపడి చదివితేనే మంచి భవిష్యత్ ఉంటుందని, ప్రతి స్టూడెంట్ ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు. స్టూడెంట్లకు క్వాలిటీ భోజనం పెట్టాలని, వంట చేసే వారు శుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం స్టూడెంట్లతో కాసేపు వాలీబాల్ ఆడారు. మంత్రి వెంట డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాణోతు రవిచందర్ ఉన్నారు.
లాంగ్వేజ్ పండిట్లకు ప్రమోషన్లు ఇచ్చాం
హనుమకొండ సిటీ, వెలుగు : ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న లాంగ్వేజ్ పండిట్ల ప్రమోషన్లను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే క్లియర్ చేశామని మంత్రి సీతక్క చెప్పారు. ప్రమోషన్లు ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ హనుమకొండలోని బాషోపాధ్యాయ సంస్థ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీటింగ్‌కు సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో లాంగ్వేజ్ పండిట్లు కీలకంగా వ్యవహరించారన్నారు. ప్రమోషన్లు ఇవ్వకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లు నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. సమావేశంలో ఆ సంస్థ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పోలోజు శ్రీహరి, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు పెండ్యాల బ్రహ్మయ్య, గాలి హర్షవర్దన్‌రెడ్డి, ఎస్‌వీ.సుబ్బారావు, అడ్లూరి వెంకటేశ్వర్లు, మర్రిపల్లి రమేశ్, షేక్ హాజీ నూరాని పాల్గొన్నారు.