కరీంనగర్ సిటీలో ఏ పనికైనా కార్పొరేటర్ల పర్మిషన్​ ఉండాల్సిందే

కరీంనగర్ సిటీలో ఏ పనికైనా కార్పొరేటర్ల పర్మిషన్​ ఉండాల్సిందే
  • ఇండ్లు కట్టాలన్నా.. జాగలు కొనాలన్నా వాళ్ల దయ ఉండాల్సిందే..
  • కరీంనగర్ ను శాసిస్తున్న అధికార పార్టీ లీడర్లు
  • అడ్డూ అదుపులేని ఆగడాలు 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో కొందరు అధికార పార్టీ కార్పొరేటర్ల దందా జోరుగా సాగుతోంది. కార్పొరేటర్ల పర్మిషన్​ లేనిదే ఏ నిర్మాణం, స్థల కొనుగోలు అమ్మకాలు జరగని పరిస్థితి. నగరంలో చుట్టుపక్కల గ్రామాలు విలీనం కావడంతో భూముల రేట్లు అమాంతం పెరిగాయి. పైసా పైసా కూడబెట్టుకుని  ఓపెన్ ప్లాట్లు తీసుకుంటే..  కిరికిరి పెట్టడం.. అందులో వాటాలు అడగడం.. తక్కువ ధరకే అమ్మాలని  ఒత్తిడి చేయడం.. ఇవ్వకపోతే బెదిరించడం కొందరు కార్పొరేటర్లకు అలవాటుగా మారింది. ముఖ్యంగా సిటీ శివార్లలో ఈ దందాలు జోరుగా సాగుతున్నాయి. 

పెరుగుతున్న దందాలు.. 

నగరంలో రోజురోజుకు అధికార పార్టీ నాయకులు, కార్పొరేటర్ల  భూదందాలు పెరిగిపోతున్నాయి.   సీతారాంపూర్ ఏరియాలోఅధికార పార్టీ  లీడర్లు  దౌర్జన్యంగా నిర్మాణంలో ఉన్న ఇండ్లను జేసీబీలతో కూల్చివేశారు. అర్ధరాత్రి జేసీబీలు.. పదుల సంఖ్యలో మనుషులు వచ్చి కూలగొట్టారు. కొద్ది రోజుల కిందట కేఆర్ గార్డెన్ కు చెందిన గోడ కూల్చారు. సీతారాంపూర్ ఏరియాలో ప్రభుత్వ భూముల కబ్జాల్లో అక్కడి అధికార పార్టీ లీడర్  హస్తం ఉంది. అక్కడ మంచినీళ్ల బావి ఉన్న స్థలాన్ని కూడా కబ్జా చేసేందుకు ప్లాన్ వేశారు. గతంలో సర్కారు భూమిలో నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా అటు మున్సిపల్, ఇటు పోలీస్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రేకుర్తి ఏరియాలో ప్రభుత్వ భూమిలో  కబ్జాలు పెరిగిపోతున్నాయి. పాత డేట్లతో పంచాయతీ నుంచి పర్మిషన్ల ఇస్తూ రూ.లక్షల్లో ముడుపులు తీసుకుంటున్నారు.  సర్వే నంబర్ 55 సర్కారు భూమిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. సర్వే నంబర్ 137 లో గుట్ట  చుట్టూ ఇండ్లు కడుతున్నారు. గుంటకు రూ. 25లక్షలకు పైగా ఉండటంతో ఈ ఏరియాపై రియల్టర్ల కన్ను పడింది. దీంతో అధికార పార్టీ లీడర్ల అండతో ఈ దందా సాగుతోంది. తీగలగుట్టపల్లి ఏరియాలో వెంచర్ల రోడ్లనే కబ్జా చేసి మూడంస్తుల బిల్డింగ్ కట్టారు. ఈ ఏరియాలో స్థానిక లీడర్ అనుమతి లేనిదే ఏ ప్లాట్ అమ్మకం, కొనుగోళ్లు జరగవు. ఎవరి భూములైనా ఆ లీడర్​కు అమ్మాల్సిందే. . లేకపోతే రాత్రికి రాత్రే కూల్చివేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇదే తరహాలో  17వ డివిజన్  కు చెందిన అధికార పార్టీ లీడర్  ఓ వైపు ఉన్న  రోడ్డును కబ్జా చేసి, నకిలీ పేపర్లు తయారు చేశాడు. ఏకంగా నాలుగు గుంటల భూమిని ఇలా ప్లాట్​గా మార్చి రూ.కోటికి అమ్మినట్లు ప్రచారంలో ఉంది.  ఈ వ్యవహారంలో పక్క ప్లాట్ల ఓనర్లు రోడ్డును ఎలా కబ్జా చేసుకుంటావని అడిగినందుకు వారిపై తన అనుచరులతో రాళ్ల దాడి చేయించినట్లు సమాచారం. 

ఎటు చూసినా లీడర్ల  అక్రమాలే..

తనకు అనుకూలంగా ఉండడం లేదని ఏకంగా ఓ కార్పొరేటర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల గదులకు తాళాలు వేయడం కలకలం రేపింది. మరో కార్పొరేటర్ అక్రమంగా కమాన్ల నిర్మాణాలు చేపడుతున్నాడు. దీన్ని కూల్చాలని హైకోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు ఏం చేయలేకపోతున్నారు. కొందరు కార్పొరేటర్లు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి నాసిరకం పనులు చేపడుతున్నారు. 

ఓ కార్పొరేటర్  అనుచరుడు రోడ్డును ఆక్రమించి మూడంతస్తుల బిల్డింగ్ కట్టాడు. దీన్ని కూల్చేందుకు జిల్లా టాస్క్ ఫోర్స్ కు ఆర్డర్స్ ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదు. ఇంకో కార్పొరేటర్ తన పరిధిలో ఏకంగా తన సొంత వెంచర్ కే స్మార్ట్ సిటీ రోడ్లు వేసుకున్నాడు. మరొకరు స్మార్ట్ సిటీ డ్రైయిన్ ను పార్కింగ్ కోసం తవ్వేశారు. స్మార్ట్ సిటీ పరిధిలోకి రాకున్నా అక్కడ పనులు చేయించుకున్నాడు మరో కార్పొరేటర్.  బినామీ పేరిట పార్కులకు కాంట్రాక్టులు దక్కించుకున్నాడు. ఇంకొకరైతే ఎక్కడ అపార్ట్ మెంట్ కడితే అక్కడ వాలిపోయి. రూ. 5లక్షలకు తక్కువ కాకుండా వసూళ్లకు పాల్పడుతున్నాడు. -ఓ కార్పొరేటర్  శ్మశానవాటికలో పనులు చేపట్టి  సుమారుగా రూ.కోటిన్నర అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.  ఇంత జరుగుతున్నా అధికారులు సైలంట్​గా ఉండటం అనుమానాలకు తావిస్తోంది.

‘కరీంనగర్  పరిధిలోని సీతారాంపూర్ ఏరియాలో కొట్టె రాజయ్య తనకున్న భూమిలో  నిర్మిస్తున్న మూడు ఇండ్లను  మున్సిపల్ నుంచి అన్ని రకాల పర్మిషన్లు ఉన్నా కొద్దిరోజుల కిందట  రాత్రికి రాత్రే  జేసీబీ తీసుకొచ్చి కూలగొట్టారు. తెల్లారి చూసుకున్న బాధితులు లబోదిబోమన్నారు.’ ‘భగత్ నగర్ పెద్దమ్మ గుడి ఏరియాకు చెందిన  సింగరేణి రిటైర్డు ఉద్యోగి రాజిరెడ్డి తన సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు వస్తే స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెడుతున్నారు. రాత్రికి రాత్రి మనుషులు వచ్చి హంగామా చేశారు. అక్కడ కంకర, ఇసుక పోసి, చంపేస్తామని బెదిరించారు. పోలీసుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నో సార్లు కలెక్టరేట్ లో ప్రజావాణిలో అధికారులను కలిసి నిరసనలు తెలిపాడు. అయినా ఇయ్యాల్టి వరకు సమస్య పరిష్కారం కాలేదు.”