ఎల్లుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

 ఎల్లుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష టీడీపీ ప్రకటన 
  • సమావేశాలు పెట్టకపోతే ప్రభుత్వం కూలిపోతుందనే ఆందోళనతోనే పెడుతున్నారు: టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు
  • ఎన్ని రోజులు జరపాలనేది తేల్చనున్న శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం

అమరావతి: పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఈనెల 20న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీతోపాటు మండలిలోనూ రెండు చోట్ల సమావేశాలు ప్రారంభం అవుతాయి. కరోనా నేపధ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులు, లాక్ డౌన్ చర్యలు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల్లో ఏర్పాట్లు తదితర వాటిపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. బడ్జెట్ ఆమోదం కోసం నిర్వహించే ఈ సమావేశాలను కరోనా వ్యాప్తి నేపధ్యంలో ఒక రోజుకే పరిమితం చేయాలా ? లేక మరికొన్ని రోజులు నిర్వహించాలా అనేది శాసన సభ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఖరారు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మరో వైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కరోనా కట్టడి విషయాన్ని సీఎం జగన్ సీరియస్ గా తీసుకోవడం లేదని.. ఒక్కసారి కూడా అఖిలపక్ష సమావేశాలు పెట్టలేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, శాసనసభా పక్ష ఉపనేత  అచ్చెన్నాయుడు ఆరోపించారు. విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడిన ప్రతిపక్షాలను, అఖిలపక్ష పార్టీల సలహాలు, సూచనలు స్వీకరించే ప్రయత్నమే ప్రభుత్వం చేయలేదని విమర్శించారు.  6 నెలల పాటు సమావేశాలు నిర్వహించకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుందన్న ఆందోళనతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. 2 లక్షల 11 వేల ఏపీలో బడ్జెట్‌పై విపులంగా చర్చ జరగాలని, తూతూమంత్రంగా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తప్పుబట్టారు. అందుకే సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించామని అచ్చెన్నాయుడు తెలిపారు. కనీసం ఇరుగు పొరుగు రాష్ట్రాలను చూసైనా సీఎం జగన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల మాట్లాడుతూ కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్న సమయంలో అసెంబ్లీ సమావేశాలను ఎలా నిర్వహిస్తారు? అని ప్రశ్నించారు. మార్చిలో సుమారు 900 కేసులు మాత్రమే నమోదయ్యాయి, అలాంటప్పుడే నిర్వహించకుండా ఇప్పుడు 20 వేలు దాటి నమోదు అవుతుంటే ఎలా నిర్వహిస్తారని? యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.