హుజూర్ నగర్, వెలుగు: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరంనకు చెందిన మల్లికార్జున్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి ఆన్ లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్ లో నష్టపోయి దొంగగా మారాడు. మంగళవారం సీఐ చరమంద రాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 5న మండలంలోని వేపాల సింగారంలో పట్టపగలు తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగి 6 తులాల బంగారు నగలు, రూ.90 వేల నగదు చోరీ జరిగింది. ఈ విషయంపై విచారణ జరుపుతుండగా అనుమానాస్పదంగా కనిపించిన మల్లికార్జున్ రెడ్డి పట్టుబడ్డాడు.
అతడి వద్ద దొంగతనం చేసి కరిగించిన బంగారం దొరికింది. విచారించగా వేపాల సింగారంలో, చింతకాని మండలం పొద్దుటూరులో, అనంతగిరి మండలం అమీనా బాద్ వరస చోరీలకు పాల్పడ్డట్టు ఒప్పుకున్నాడు. ఆన్ లైన్ గేమ్స్ లో నష్టపోయి, విలాసాలకు అలవాటు పడి, ఉద్యోగం లేకపోవడంతో దొంగతనాలు చేస్తున్నట్టు చెప్పాడు. అతడి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. కేసు విచారణలో చురుకుగా వ్యవహరించిన ఎస్ఐ మోహన్ బాబు, సిబ్బంది శంబయ్య, నాగరాజు, వీరప్రసాద్, వెంకటేశ్వర్లను అభినందించారు.
