AP Budget 2024-25 :  ఓట్ ఆన్ బడ్జెట్..  ఏ పథకానికి ఎంత కేటాయింపు?

AP Budget 2024-25 :  ఓట్ ఆన్ బడ్జెట్..  ఏ పథకానికి ఎంత కేటాయింపు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్(ఓటాన్ అకౌంట్ బడ్జెట్) 2024-25 ను శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బుధవారం (ఫిబ్రవరి 7)  ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,86,389 కోట్ల బడ్జెట్‍ను ప్రవేశపెట్టారు. ఇందులో రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయం, రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు , రూ.55,817 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51 శాతం మేర ద్రవ్యలోటు ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ లోటు జీఎస్డీపీలో 1.56 శాతం మేర ఉంటుందని మంత్రి బుగ్గన ప్రతిపాదించారు.

బడ్జెట్ కేటాయింపులు ఇలా

  • ఉచిత పంటల బీమా కోసం రూ.3,411 కోట్లు
  • సున్నా వడ్డీ రుణాలు రూ.1,835 కోట్లు
  • జగనన్న విద్యాదీవెన రూ.11,901 కోట్లు
  • జగనన్న వసతి దీవెన రూ.4267 కోట్లు
  • జగనన్న పాలవెల్లువ రూ.2697 కోట్లు
  • వైఎస్ఆర్ బీమా రూ.650కోట్ల
  • నేతన్ననేస్తం కోసం రూ.983
  • కల్యాణమస్తు, షాదీ తోఫా రూ.350 కోట్లు
  • జగనన్న తోడు రూ.3,374 కోట్లు
  • వాహనమిత్ర రూ.1,305 కోట్లు

రెవెన్యూ తెచ్చే అప్పులు

2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2,05,352 కోట్లు రెవెన్యూ రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర పన్నుల ద్వారా రూ. 49,286 కోట్లు వస్తుందని, రాష్ట్ర పన్నుల ద్వారా రూ.1,09,538 కోట్లు వస్తుందని బడ్జెట్ లో అంచనాలు వేశారు. పన్నేతర ఆదాయంగా రూ. 14,400 కోట్లు కాగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా రూ.32,127 కోట్లు వస్తుందని అంచనా వేశారు. బహిరంగ మార్కెట్ ద్వారా రూ.71 వేల కోట్ల రుణ సేకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కేంద్రం నుంచి రూ. 61,642 కోట్లు రుణం తీసుకోవాలని యోచిస్తుంది. ఇతర మార్గాల ద్వారా మరో రూ.25 వేల కోట్ల అప్పు చేయాలని బడ్జెట్ లో ప్రభుత్వం ప్రతిపాదించింది.

బడ్జెట్‌కు ముందు కీలక విషయాలు వెల్లడించిన ఆర్థిక మంత్రి..

  •  బడ్జెట్‌లో సంక్షేమానికే పెద్దపీట ఉంటుంది: ఆర్థిక మంత్రి బుగ్గన
  •  విద్య, వైద్యం, మహిళ సాధికారిత, వృద్ధులకు ప్రాధాన్యం: ఆర్థిక మంత్రి బుగ్గన
  •  సంతృప్త స్థాయిలో మానిఫెస్టోను అమలు చేయడం ఒక బెంచ్ మార్క్: ఆర్థిక మంత్రి బుగ్గన
  •  మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లోనూ టీడీపీ సభ్యుల ఆందోళన
  •  స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు
  •  రైతు వ్యతిరేక ప్రభుత్వం, పోలవరం కట్టలేకపోయిన ప్రభుత్వం అంటూ నినాదాలు

స్థూల ఉత్పత్తి రేటులో గణనీయ ప్రగతి


2014-15 రెవెన్యూ లోటు గ్రాంటు కింద రూ.10,460 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం నుంచి రావలసిన రూ.1,050 కోట్లు గ్రాంటును రాబట్టగలిగామన్నారు. 15వ ఆర్థిక సంఘాన్ని ఒప్పించి, రూ.30,497 కోట్లు గరిష్ట రెవెన్యూ లోటు గ్రాంటును సాధించుకోగలిగామన్నారు. నూతన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల రిజిస్ట్రేషన్లు 2020లో 65,174 నమోదు కాగా 2023లో 7. 20 లక్షలకు పెరిగాయన్నారు. దేశంలో 5% వాటాతో మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధి పరంగా ఏపీ 7వ స్థానంలో ఉందన్నారు. 2018-19లో 11% రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటుతో 14వ స్థానంలో ఉండగా, 2023నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 16.2 శాతానికి పెరగటంతో 4వ స్థానానికి చేరుకున్నామన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వ్యాపార సంస్కరణల ప్రణాళిక ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ అగ్రస్థానం కైవసం చేసుకుందన్నారు. 2018-19 సంవత్సరంలో మన రాష్ట్ర వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3 శాతంతో 12వ స్థానంలో ఉండగా, ఈ రోజు, మన రాష్ట్రం 13% వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 6వ స్థానంలో ఉందన్నారు.