బడ్జెట్ లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత: మంత్రి బుగ్గన

 బడ్జెట్ లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత: మంత్రి బుగ్గన

మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంథంలా భావించారని.. ఏ వర్గాన్నీ వస్మరించవద్దన్న వైఎస్సార్ స్ఫూర్తితోనే బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఫిబ్రవరి 7వ తేదీ బుధవారం ఏపీ అసెంబ్లీలో 2024-25 ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌పై  మంత్రి బుగ్గన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ లో వ్యవసాయానికి అధిక ప్రధాన్యత ఇచ్చామన్నారు. రాజకీయాలకు అతీతంగా పథకాలను అమలు చేశామని చెప్పారు. 

53.58 లక్షల మంది రైతులకు 33,300 కోట్ల రూపాయల మేర రైతు భరోసా ఆర్ధిక సాయం అందించామని తెలిపారు. 10,778 రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్లుగా ఏర్పాటు చేశామని... రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని చెప్పారాయన. ఆక్వా ఉత్పత్తిని మరింత పెంచేలా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టామని... 2 వేలకు పైగా ఫిష్ ఆంధ్రా రీటైల్ దుకాణాలు స్థాపించి... ఏపీని దేశంలోనే ఆక్వాహబ్‌గా తయారు చేశామని బుగ్గన వివరించారు.

బుగ్గన ప్రసంగంలోని పాయింట్స్:

  • 99.81 శాతం పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాం.
  • రూ.1,910 కోట్లతో 43 లక్షల విద్యార్థులకు జగనన్న గోరుముద్ద అమలు చేశాం.
  • మధ్యాహ్నం భోజనం కింద గత ప్రభుత్వం కన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాం.
  • వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద 35 లక్షల పిల్లలకు ప్రయోజనం చేకూరింది.
  • జగనన్న అమ్మఒడితో అందరికీ నాణ్యమైన విద్య అందుతుంది.
  • జగనన్న విదేశీ విద్యాదీవెన కింద విద్యార్థికి కోటీ 25లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నాం.
  • మొత్తం 1858మంది విద్యార్తులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు.
  • నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హబ్ లు ఏర్పాటు చేశాం.
  • రాష్ట్రంలో జిల్లాలను 13 నుంచి 26కు పెంచడంతోపాటు 52 రెవిన్యూ డివిజన్లను 77కు పెంచాం. 
  • లక్షా 35వేల మంది ఉద్యోగులతో గ్రామ వార్డు సచివాలయాలు నడుస్తున్నాయి.
  • 2 లక్షల 66వేల వాలంటీర్లను నియమించి.. గడపగడపకూ పాలన చేరువ చేశాం.
  • జిల్లాల్లో నూతన కలెక్టరేట్ భవనాల నిర్మాణాలను చేపట్టాం.
  • ఆర్థిక వ్యవస్థలో మహిళలను సమాన భాగస్వాములను చేశాం.
  • 43.61 లక్షల మంది మహిళలకు అమ్మఒడి పథకం ద్వారా రూ.26,067కోట్ల ఆర్థిక సాయం చేశాం.
  • 14,255 అంగన్ వాడీ కేంద్రాలను మరింత మెరుగుపర్చాం.
  • ఆరోగ్యశ్రీలో రూ.25లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు అందించాం.
  • జగనన్న ఆరోగ్య సురక్ష కింద కోటీ 67 లక్షల కుటుంబాలకు సేవలు అందించాం
  • ఫ్యామిలీ డాక్టర్ కింద మండలానికో 108, 104 సర్వీసులు ఏర్పాటు చేశాం.