
8 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని ప్రధాని మోడీని సీఎం జగన్ అభ్యర్థించారు. టీఎస్ డిస్కమ్‌లు తమ రాష్ట్రానికి బకాయి పడిన రూ.6,886 కోట్లను వెంటనే ఏపీ జెన్‌కోకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏపీ జిల్లాల సంఖ్య 26కు పెరిగిందని, ప్రజల వైద్య అవసరాలను తీర్చడానికి ప్రస్తుతం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి మరో 14 మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలని జగన్ ప్రధానిని కోరినట్లు ఏపీ సీఎంఓ ప్రకటించింది.
రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చించినట్లు సీఎం జగన్ ట్వీట్ చేశారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతో పాటు పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తిపై పీఎం మోడీ సానుకూలంగా స్పందించారని అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో ఆయన సమావేశమయ్యారు.