కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వీకెండ్, వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో ఏడు కొండలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి అనుమతిస్తుండటంతో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తిరుమలకు తరలి వచ్చారు.. వస్తున్నారు.
భక్తుల రద్దీ కారణంగా .. శ్రీవారి భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాన్ని ఎక్కువ మంది భక్తులకు కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. శుక్రవారం ( జనవరి 2) వ తేదీన అదనంగా 5వేల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. స్లాటెడ్ దర్శన విధానంతో గంటల వ్యవధిలోనే భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన టీటీడీ ప్రశంసలు అందుకుంటోంది. ఈ కొత్త విధానం విజయవంతం కావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. వీకెండ్.. వరుస సెలవులు.. వైకుంఠ ద్వార దర్శనం కారణంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సామాన్య భక్తులతో పాటు వీఐపీలు కూడా తిరుమలకు భారీగా తరలి వచ్చి కలియుగ వైకుంఠనాథుడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటన్నారు.
ఈ ఏడాది (2026) ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా తొలి నాలుగు రోజులు ( 2025 డిసెంబర్ 30,31, 2026 జనవరి 1,2 తేదీలు) వైకుంఠ ద్వార దర్శనాలు జరిగాయి. భక్తులు ఇబ్బంది పడకుండా .. టీటీడీ అధికారులు.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. టీటీడీ అధికారుల అంచనాలకు మించి భక్తులు చేరుకోవడంతో, ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్, శిలాతోరణం నుంచి భక్తులను క్రమబద్ధంగా లోపలి క్యూ లైన్లలోకి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, ఆహారం, భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
తిరుమలలో స్లాట్ బుకింగ్ సక్సెస్ అయ్యింది. మిగతా రోజుల్లో సైతం ఇదే తరహా విధానాన్ని కొనసాగించాలని టిటిడి భావిస్తోంది. దీనివల్ల నిర్దేశించిన సమయానికి భక్తులు చేరుకోగలిగారు. 98 శాతం మంది భక్తులు తమకు కేటాయించిన స్లాట్ సమయానికి రిపోర్ట్ చేశారు. అయితే నాలుగు గంటలకు మించి ఏ భక్తుడు కూడా క్యూ లైన్ లో వేచి ఉండలేదు. చాలామందికి గంటన్నర నుంచి రెండు గంటల్లోనే దర్శనం అయింది.
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రిపోర్టింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడంతో క్యూ లైన్ల నిర్వహణ కూడా సులభంగా మారింది. పూర్తి టెక్నాలజీతో ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. టికెట్ జారీ ప్రక్రియ నుంచి లగేజ్ డిపాజిట్, బాడీ స్కానింగ్.. ఇలా అన్ని అంశాలను రియల్ టైం డాష్ బోర్డులో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధానం ఉంది.
ఆలయంలో దాదాపు 300కు పైగా సీసీ కెమెరాలు, 42 ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో ఎక్కడైనా రద్దీ పెరిగితే వెంటనే ఆన్ లైన్ ద్వారా గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. క్యూ లైన్లలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ, భక్తుల కదలికలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో దర్శనం సులభంగా అవుతోందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నప్రసాదాలు సకాలంలో అందించారని ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామి వారి దర్శనం చేసుకున్నామని తెలిపారు..
వైకుంఠ ద్వార దర్శనానికి సర్వదర్శనం అమలు చేస్తున్నారు. ఈ కారణంగా తిరుమలలో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్మారు. శ్రీవారి దర్శనం దృష్ట్యా భక్తులు సహనం పాటించాలని సూచిస్తున్నారు. అధికారుల సూచనలను పాటించి సహకరించాలని టిటిడి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి కోరారు. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో శ్రీవారి దర్శనానికి ఆలస్యమవుతోందని తెలిపారు.
టీటీడీలోని అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో భక్తులకు సేవలందిస్తున్నారు. క్యూ లైన్ లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అందిస్తున్నారు. భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన సమయం, భక్తులు క్యూ క్యూలైన్లలోనికి నిర్దేశించిన ప్రవేశ మార్గాలను, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా తెలియజేస్తున్నారు. అప్పటివరకు భక్తులు, యాత్రికల వసతి సముదాయాలలో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి సూచించారు. భక్తుల అధిక రద్దీ దృష్ట్యా అధికారుల సూచనలను గమనిస్తూ ... సంయమనం పాటిస్తూ స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శుక్రవారం రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని 83,032 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,372 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. శుక్రవారం ( జనవరి 2) తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.10 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు నాలుగు రోజులలో 2 లక్షల 86 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నారు.. ఈనెల 8 వ తేది అర్ధరాత్రి వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి..
