తిరుమలలో సీఎం జగన్

తిరుమలలో సీఎం జగన్

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వారు ఇవాళ ఉదయం ఐదు తలల చిన్న శేషవాహనంపై తిరుమాఢ వీధుల్లో విహరించారు. చిన్న శేషుడిని వాసుకిగా భావిస్తారు. చిన్న శేషవాహన సేవలో స్వామి వారిని దర్శించుకుంటే కుండలినీ యోగ సిద్ధి ఫలం లభిస్తుందని నమ్మకం. బ్రహ్మోత్సవాలతో పాటు దసరా సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు భారీగా వస్తున్నారు. 

తిరుమలలో ఏపీ సీఎం జగన్ రెండో రోజు పర్యటిస్తున్నారు. ఉదయం శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రాలతో తిరునామం ధరించి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. మహాద్వారం దగ్గర జగన్ కు అర్చకులు, అధికారులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో జగన్ కు అర్చకులు వేదాశీర్వచనం చేశారు. 

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి ఎదురుగా కొత్తగా నిర్మించిన పరకామణి భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఆధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఈ భవనంలో కానుకల లెక్కింపును భక్తులు చూసేందుకు వీలుగా రెండు వైపులా అద్దాలు ఏర్పాటు చేసింది టీటీడీ. శ్రీవారి ఆలయం నుంచి హుండీలను బ్యాటరీ కార్ల ద్వారా కొత్త భవనానికి తరలిస్తారు. సిబ్బంది కింద కూర్చోవాల్సిన అవసరం లేకుండా టేబుల్స్, కుర్చీలు ఏర్పాటు చేశారు. కానుకలు భద్రపరిచేందుకు వీలుగా పరకామణి భవనంలో స్ట్రాంగ్ రూంలను టీటీడీ నిర్మించింది. నాణాలను వేరు చేసేందుకు రెండున్నర కోట్లతో ఆటోమేటిక్ సెగ్రిగేషన్ మిషన్ ను ఏర్పాటు చేసింది. మరో యంత్రం సాయంతో కౌంటింగ్,ప్యాకింగ్ చేసేందుకు మిషనరీలను ఏర్పాటు చేశారు. సిబ్బంది కోసం మరుగుదొడ్లు ఇతర అన్ని సౌకర్యాలు పరకామణి భవనంలోనే నిర్మించారు. దాతలు అందించిన 23 కోట్ల విరాళంతో పరకామణి భవనాన్ని టీటీడీ నిర్మించింది. వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నూతనంగా నిర్మించి, టీటీడీకి ఇచ్చిన భవనాన్ని జగన్ ప్రారంభించారు.