సాయం రాకపోతే నాకే చెప్పండి.. వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

సాయం రాకపోతే నాకే చెప్పండి.. వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

వరద బాధితులందరికీ సాయం అందేలా ఏపీ  ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం జగన్‌ తెలిపారు. సహాయక చర్యల కోసం అధికారులకు తగిన సమయం ఇచ్చామని..నష్ట పరిహారం పక్కాగా అందేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అధికారులు వారంపాటు గ్రామాల్లోనే ఉండి.. వరద బాధితులకు నిత్యవసరాలు అందించారన్నారు.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ( ఆగస్టు 7)  పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలపై కూనవరం, వీఆర్‌పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడారు.

ఆ ఆరాటం ప్రభుత్వానికి లేదు…

వరదల వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ. 10 వేలు ఇవ్వాలని, ఇళ్లలోకి నీరు వచ్చిన వారికి రూ. 2 వేలు ఆర్థికసాయం ఇచ్చామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. వరద సాయం అందకుంటే ఇక్కడికి వచ్చి తనకు చెప్పాలని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరద సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు రాలేదని, వరద బాధితులందరికీ  సాయం అందించారని తెలిపారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే తమ ప్రభుత్వ  తాపత్రయమని.. డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.  కొన్ని రోజుల కిందట గోదావరి నది పొంగి వరద వచ్చిన పరిస్థితుల్లో దాదాపు 16 లక్షల క్యూసెక్కుల  నీళ్లు వచ్చాయన్నారు. మన ప్రాంతాలకు ఎక్కడెక్కడ దెబ్బ తగిలి నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించి కలెక్టర్‌కు వరద వచ్చినప్పుడే ఆదేశాలు ఇచ్చాం. మొట్టమొదటి సారిగా వరదలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గతానికంటే భిన్నంగా ఉందని సీఎం జగన్ తెలిపారు

సాయం అందలేదనే మాట రావొద్దని ఆదేశించాం

వైసీపీ ప్రభుత్వంలో ఎవరికి ఎప్పుడు ఏ నష్టం వచ్చినా కూడా అది ఏ ఫొటోల కోసమో లేకపోతే అప్పటికప్పుడు వచ్చి అధికార యంత్రాంగం అంతా నా చుట్టూ తిరుగుతున్నట్లు చేయడమో చేయలేదు. అధికారులకు కావాల్సిన వనరులు ఇచ్చి వారం రోజులపాటు సహాయ కార్యక్రమాలకు ఏ మాత్రం ఆలస్యం కాకుండా  చేయాలని చెప్పానన్నారు. కలెక్టర్లకు సదుపాయాలు ఇచ్చి, గ్రామ సచివాలయాల వాలంటీర్ల వరకు అందరనీ  యాక్టివేట్‌ చేశామని తెలిపారు. వారం రోజుల తర్వాత  మళ్లీ   వస్తాను...  గ్రామాల్లో తిరిగినప్పుడు మాకు రావాల్సిన సాయం అందలేదనే మాట ఎవరైనా అంటే అది బాగుండదని  అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు  పేర్కొన్నారు.