
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు బుధవారం (జులై 23) గుంటూరు కోర్టు సమన్లు జారీ చేయటం సంచలనంగా మారింది. ఎన్నికల ముందు నమోదైన కేసు.. కూటమి ప్రభుత్వం విత్ డ్రా చేసుకున్న తర్వాత మళ్లీ రీ ఓపెన్ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో 30 వేల అమ్మాయిలు మిస్సింగ్ కు వాలంటీర్లే కారణమని ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కొంత మంది అప్పట్లో ఫిర్యాదు చేయగా.. గత ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం రాగానే ఆ కేసు విత్ డ్రా చేసుకున్నారు.
లేటెస్ట్ గా కేసు రీఓపెన్ చేయాలని జడా శ్రావణ్ కుమార్ వాలంటీర్ల తరుఫున పిటిషన్ వేశారు. పిటిషన్ ను స్వీకరించిన గుంటూరు కోర్టు.. కేసుకు నెంబర్ ఇచ్చి పవన్ కల్యాణ్ కు సమన్లు జారీ చేసింది.
వైసీపీ పాలనలో రాష్ట్రంలో 30 వేల మంది యువతులు అదృశ్యమయ్యారని, ఈ ఘటనలకు వాలంటీర్లే కారణమంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్. వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సేకరించిన డేటానే ఇందుకు కారణమని అప్పట్లో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అప్పటి వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లతో ఫిర్యాదులు చేయించింది.
ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. ఈ పిటిషన్ ను క్వాష్ చేయాలంటూ పవన్ కల్యాణ్ పిటిషన్ దాఖలు చేయటంతో విచారణ జరిపిన హైకోర్టు స్టే విధిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కేసును ఉపసంహరించుకుంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు ఎన్నికల సమయంలో పలు చర్చలకు దారి తీశాయి. జగన్ ప్రభుత్వంలో నిజంగానే అమ్మాయిలు మిస్సయ్యారా అనే కోణంలో చర్చ జరిగింది. అయితే పవన్ చేసినవి అసత్య ఆరోపణలు అని అప్పట్లో కొందరు విమర్శించారు. ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ఖండించింది. కేంద్ర హోంశాఖ రిపోర్టును ఉంటకిస్తూ.. పవన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రులు, ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. వాలంటీర్లు కేసులు వేశారు. ఎన్నికల్లో గెలిచి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం కేసును ఉపసంహరించుకుంది. అయితే ప్రస్తుతం జడా శ్రవణ్ మరోసారి పిటిషన్ వేయడంతో కేసు రీ ఓపెన్ అయ్యింది.