జీఆర్ఎంబీ మీటింగ్​కు ఏపీ డుమ్మా .. మార్చి 1కి సమావేశం వాయిదా

జీఆర్ఎంబీ మీటింగ్​కు ఏపీ డుమ్మా .. మార్చి 1కి సమావేశం వాయిదా

 హైదరాబాద్, వెలుగు : గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (జీఆర్ఎంబీ) మీటింగ్​కు ఆంధ్రప్రదేశ్​ డుమ్మా కొట్టింది. తమ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం ఉన్న నేపథ్యంలో మంగళవారం నిర్వహించే మీటింగ్​కు రాలేమని మూడు రోజుల క్రితమే బోర్డుకు ఏపీ ఈఎన్సీ లేఖ రాశారు. అయితే, సమావేశంలో కీలక అంశాలు చర్చించాల్సి ఉందని, తప్పకుండా హాజరుకావాలని బోర్డు మెంబర్​సెక్రటరీ మళ్లీ లేఖ రాశారు. 

 మంగళవారం హైదరాబాద్​ జలసౌధలో జీఆర్ఎంబీ చైర్మన్​ముకేశ్​కుమార్​సిన్హా అధ్యక్షతన మీటింగ్​ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్​కు తెలంగాణ ఈఎన్సీ (జనరల్) అనిల్​కుమార్, ఇంటర్​స్టేట్​సీఈ శంకర్​నాయక్, ఎస్ఈ కోటేశ్వర్​రావు, ఈఈ సుబ్రమణ్య ప్రసాద్​హాజరయ్యారు. ఏపీ అధికారుల కోసం కొంత సేపు వెయిట్​చేశారు. అనంతరం వారిని సంప్రదించగా తాము రాలేమని చెప్పడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని చైర్మన్​ప్రకటించారు. మార్చి ఒకటో తేదీ తర్వాతనే మీటింగ్​ఏర్పాటు చేయాలని ఏపీ అధికారులు బోర్డుకు సమాచారం ఇచ్చారు.

 దీంతో మార్చి ఒకటో తేదీన నిర్వహించే సమావేశానికి రావాలని కోరుతూ మంగళవారం బోర్డు అధికారులు ఏపీ, తెలంగాణ అధికారులు, ఇంజినీర్లకు తెలిపారు. గోదావరి జలాలను ఇంటర్​స్టేట్​వాటర్​డిస్ప్యూట్స్​యాక్ట్​–1956లోని సెక్షన్​–3 ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేయాలని ఏపీ కోరుతోంది. ఈ అంశంతో పాటు గోదావరిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులు వినియోగించే నీళ్లు, ప్రాజెక్టులకు అనుమతులు, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్​ఇష్యూస్​పై జీఆర్ఎంబీ సమావేశంలో చర్చించాల్సి ఉంది. వివిధ కారణాలతో ఈ సమావేశం వాయిదా పడుతోంది. మార్చి ఒకటో తేదీన కూడా బోర్డు సమావేశం నిర్వహించే అవకాశం కనిపించడం లేదు.