కడప పేలుడులో మృతులకు 10లక్షల పరిహారం

 కడప పేలుడులో మృతులకు 10లక్షల పరిహారం
  • కడప పేలుడులో మృతులకు 10లక్షల పరిహారం
  • గాయపడిన వారికి 5 లక్షలు 
  • మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అమరావతి: కడప జిల్లా మామిళ్లపల్లె క్వారీ పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం... మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షలు చొప్పున తక్షణ సహాయం ప్రకటించింది. ఐదు  ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు చేశామని, 5 రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని నిర్దేశించినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రకటించారు. క్వారీ లీజుదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించామని, పేలుడు పదార్థాల అన్‌లోడింగ్‌లో నిబంధనలు పాటించలేదని తెలిపారు. 
కలసపాడు మండలం మామిళ్ళ పల్లె గ్రామ పరిధిలోని సర్వే సంఖ్య 1 మరియు 133 ల లోని శ్రీమతి సి. కస్తూరిబాయి కి చెందిన మైనింగ్ లీజులో శనివారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య ప్రేలుడు జరిగి 10 మంది మృతి చెందినట్లు సమాచారం అందిన వెంటనే మైనింగ్ అధికారులు అప్రమత్తమయ్యారని మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రేలుడు జరిగిన ప్రదేశం సర్వే నెంబర్ 1 లో ఉత్తర భాగంలో అనగా మైనింగ్ లీజు పరిధిలో వుందని గుర్తించినట్లు తెలిపారు. మామిళ్లపల్లె గ్రామంలో సర్వే సంఖ్య 1 మరియు 133 లలో బెరైటీస్ ఖనిజo వెలికితీసేందుకు 30.696 హెక్టార్ల విస్తీర్ణములో సి. కస్తూరిబాయి 02.11.2001 నుండి 01.11.2021 వరకు క్వారీ లీజుకు అనుమతి పొందారని తెలిపారు. అయితే లీజుదారు కస్తూరిబాయి ఈ భూమిలో మైనింగ్ నిర్వహణ కార్యకలాపాలకు సి. నాగేశ్వర రెడ్డి అనే వ్యక్తికి జిపిఎ హోల్డర్ గా 31.12.2013న అనుమతి ఇచ్చారని వెల్లడించారు. 
ఇప్పటికే కడప జిల్లా కలెక్టర్ వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఈ ఘటనపై వచ్చిన వివరాల ప్రకారం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందచేశారని, లీజు దారుడి అజాగ్రత్త వల్లనే ఈ ప్రేలుడు సంభవించినదని తేలిందన్నారు. కార్మిక శాఖ నష్ట పరిహర చట్టం 1923 ప్రకారం మృతి చెందిన కూలీల కుటుంబాలకు లీజు దారు నుంచి నష్టపరిహారంను కూడా ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రి  హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, మైనింగ్ నియమావళిని ఉల్లంఘించకుండా లీజుదారులను అప్రమత్తం చేస్తామని తెలిపారు. అలాగే నిబంధనలను పాటించని లీజుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనింగ్ లీజు నిర్వహణలో అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదము జరిగినట్లు ప్రాథమిక నివేదిక ద్వారా తెలుస్తోందని అన్నారు. ఈ మేరకు మైనింగ్ లీజు జిపిఎ హోల్డర్ సి. నాగేశ్వరరెడ్డి పైన కలసపాడు మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసు నమోదు చేశారని, Fir No. 58/2021 dt. 08.05.2021 ప్రకారం చట్టపరమైన చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు.