
ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి హత్య కేసుపై కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. తనకు న్యాయం చేయాలని.. అధికారంలోకి వస్తే ఈ కేసుపై తొలి సంతకం పెడతానంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని.. గత కొంతకాలంగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగడంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సుగాలి ప్రీతి కేసును సీబీఐ అప్పగించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.
2019లో అప్పటి వైసీపీ ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించినప్పటికీ కేసు ముందుకు కదల్లేదు. 2025లో ఈ కేసు దర్యాప్తు చేయలేమంటూ చేతులెత్తేసింది సీబీఐ. దీంతో ఈ కేసు అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2017 ఆగస్టు 18న ఏపీలోని కర్నూలులో ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో పదో తరగతి విద్యార్ధిని సుగాలి ప్రీతి సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడం అప్పట్లో పెను సంచలనం రేపింది. 2017లో సుగాలి ప్రీతి హత్య జరిగినప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తున్నామని.. ఈ కేసు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తోంది సుగాలి ప్రీతి తల్లి పార్వతి. తమ బిడ్డ మరణం వెనక ఏం జరిగిందో తేలాలని.. ఆమెను ఎవరు చంపారో, ఎందుకు చంపారో తేలాలని డిమాండ్ చేస్తోంది పార్వతి.
2019లో వైసీపీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించగా.. 8 నెలలు గడిచినా సీబీఐ ఈ కేసు దర్యాప్తు ప్రారంభించకపోవడంతో 2020లో హైకోర్టును ఆశ్రయించారు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు. ఈ కేసుపై సమాధానం చెప్పాలని హైకోర్టు సీబీఐని ఆదేశించగా.. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు తమ దగ్గర తగినన్ని వనరులు లేవంటూ సమాధానం ఇచ్చింది సీబీఐ. మరి, కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అయినా ఈ కేసు ముందుకు కదులుతుందో లేదో వేచి చూడాలి.