ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: గ్రామ సచివాలయాలే  జాయింట్ సబ్ రిజిష్ట్రార్ ఆఫీసులు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: గ్రామ సచివాలయాలే  జాయింట్ సబ్ రిజిష్ట్రార్ ఆఫీసులు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 10 రకాల సేవలను అందిస్తున్న గ్రామ వార్డు సచివాలయం ముఖ్యమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలు జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలుగా సేవలందించనున్నాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 27 నుంచి నవరత్నాలు – జగనన్న శాశ్వత స్థల హక్కు పథకం ద్వారా పేదలకు అందజేసిన ఇంటి పట్టాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. ఈ రిజిస్ట్రేషన్లు  జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతాయని  ప్రభుత్వం  ఉత్తర్వులు ఇచ్చింది. పంచాయతీ కార్యదర్శులు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తిస్తూ మరో ఉత్తర్వును జారీ చేసింది.

మార్గదర్శకాలు జారీ 

ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ 1908 (1908 యాక్ట్‌ నెంబరు 16)లోని సెక్షన్‌ 7 సబ్‌ సెక్షన్‌(1) కింద అందించబడిన అధికారాలను అమలు చేయడంలో ఇతర నోటిఫికేషన్‌లను పాక్షికంగా సవరించినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

ఇందు కోసం పంచాయతీరాజ్‌ కమిషనరు, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టరు, రెవెన్యూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌శాఖ కమిషనరుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే వార్డు, గ్రామ సచివాయాలు పలు రకాల సేవలను అందిస్తున్నాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.