కృష్ణాలో 70% నీళ్లు మాకే..ఫిఫ్టీ- ఫిఫ్టీకి ఒప్పుకోని ఏపీ

కృష్ణాలో 70% నీళ్లు మాకే..ఫిఫ్టీ- ఫిఫ్టీకి ఒప్పుకోని ఏపీ

కృష్ణా నీళ్లల్లో రెండు రాష్ట్రాలకు చెరిసగం వాటా కేటాయించాలన్న తెలంగాణ ప్రతిపాదనను తాము ఒప్పుకోబోమని ఏపీ సర్కారు తేల్చిచెప్పింది. ఈ వాటర్ ఇయర్​లో తమకు 70%, తెలంగాణకు 30% నీళ్లు తాత్కాలిక వాటాగా కేటాయించాలని కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డును కోరింది. ఈ మేరకు బుధవారం ఏపీ వాటర్ రీసోర్సెస్ ఈఎన్సీ నారాయణ రెడ్డి కేఆర్ఎంబీ మెంబర్  సెక్రటరీ డీఎం రాయ్ పురేకు లెటర్​ రాశారు. తెలంగాణ మైనర్ ఇరిగేషన్  వినియోగాన్ని బచావత్ అవార్డు కేటాయింపులకు తగ్గట్టుగా 89.15 టీఎంసీలకే పరిమితం చేయాలని లెటర్​లో డిమాండ్ చేశారు. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసే వరకు రాష్ట్రానికి వాటాగా ఇచ్చే నీటిని ఎన్ బ్లాక్  అలకేషన్ ప్రకారం ఎక్కడైనా ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలన్నారు. బచావత్ ట్రిబ్యునల్ కామన్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయలేదని, బ్రజేశ్  ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి రాలేదని తెలిపారు. బచావత్, బ్రజేశ్ రెండు ట్రిబ్యునళ్లు బేసిన్ అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చాయని, ఆ తర్వాత అవతలి బేసిన్ కు నీటిని ఇవ్వొచ్చని పేర్కొన్నాయని లెటర్​లో ప్రస్తావించారు. 

2020 – 21 వాటర్ ఇయర్ లో తెలంగాణ, ఏపీ       34 : 66 నిష్పత్తిలో నీటి పంపకాలకు అంగీకారం తెలిపాయని అన్నారు. మైనర్ ఇరిగేషన్ వినియోగం, పట్టిసీమ నుంచి మళ్లించే గోదావరి నీళ్లను ఈ కోటాలో లెక్కించరాదని ఒప్పుకున్నామని పేర్కొన్నారు. క్యాచ్ మెంట్ ఏరియా, కరువు ప్రభావ ప్రాంతాల ఆధారంగా తాత్కాలిక కేటాయింపులను చెరిసగం చొప్పున నిర్ధారించాలనే తెలంగాణ వాదన సరికాదన్నారు. 
ఐదేండ్లుగా 66:34 నిష్పత్తిలో పంపకాలు 
శ్రీశైలం నుంచి ఏపీ రోజుకు 4.7 టీఎంసీలను అనుమతి లేని ప్రాజెక్టులకు తరలిస్తోందని, తెలంగాణ కేవలం 0.28 టీఎంసీలు తీసుకునే సామర్థ్యముందనే వాదనను ఏపీ వాటర్​ రీసోర్సెస్​ ఈఎన్సీ తోసిపుచ్చారు. 2015 జూన్ 18, 19 తేదీల్లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు తీసుకునేలా తాత్కాలిక ఒప్పందం చేసుకున్నామని లెటర్​లో పేర్కొన్నారు. 2017 నవంబర్ 4న నిర్వహించిన కేఆర్ఎంబీ 7వ మీటింగ్ లో ఏపీ, తెలంగాణ 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలకు ఆమోదం తెలిపాయన్నారు. ఐదేండ్లుగా ఇదే ఒప్పందం రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతోందని  తెలిపారు. బచావత్ ట్రిబ్యునల్ మైనర్ ఇరిగేషన్ కు 89 టీఎంసీలు కేటాయించినా కేవలం 46 టీఎంసీలు తీసుకుంటున్నామని  12వ బోర్డు మీటింగ్ లో తెలంగాణ చెప్పిందన్నారు. కానీ మైనర్ ఇరిగేషన్ నుంచి 175.54 టీఎంసీలు వినియోగించుకునేలా 16 వేలకుపైగా చెరువులను  తెలంగాణ పునరుద్ధరించిందని, 386 కొత్త చెరువులు, చెక్ డ్యాంలు నిర్మిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మైనర్ ఇరిగేషన్ వినియోగం యుటిలైజేషన్ లెక్కల్లోకి రావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో నీటి వాటాలు 70 : 30 నిష్పత్తిలో పున: కేటాయింపులు చేయాలని కోరారు. కేఆర్ఎంబీ జ్యురిస్​డిక్షన్​ ఇంకా అమల్లోకి రాలేదని, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ –1956 ప్రకారం ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయాల్సి ఉందన్నారు. చెన్నై, హైదరాబాద్ తాగునీటి అసవరాలు, నాగార్జునసాగర్, పులిచింతల కింద సాగు, తాగునీటి అవసరాల మేరకే శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి చేసేలా తెలంగాణను కట్టడి చేయాలని కృష్ణా బోర్డును ఏపీ వాటర్​ రీసోర్సెస్​ ఈఎన్సీ కోరారు.

ఇరిగేషన్‌‌ ఆఫీసర్లకు సీఎం కేసీఆర్ ఆదేశం
 వచ్చే నెల ఒకటో తేదీన జరగనున్న కేఆర్‌‌ఎంబీ (కృష్ణా రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డు) మీటింగ్‌‌కు హాజరు కావాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్‌‌ ఆదేశించారు. ఇందులో రాష్ట్రానికి కృష్ణా జలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం గట్టిగా వాదనలు వినిపించాలని సూచించారు. బుధవారం ప్రగతిభవన్‌‌లో సీఎం కేసీఆర్‌‌ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సుదీర్ఘంగా 8 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కేఆర్‌‌ఎంబీ మీటింగ్‌‌ అజెండా అంశాలపై చర్చించారు. బోర్డు మీటింగ్ లో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. బోర్డు మీటింగ్‌‌కు సీఎం స్వయంగా హాజరు కావాలని భావించినా, బోర్డు మీటింగ్‌‌కు సెక్రటరీలు, టెక్నికల్‌‌ మెంబర్లు తప్ప వేరేవారు అటెండయ్యే చాన్స్‌‌ లేకపోవడంతో రద్దు చేసుకున్నట్లు తెలిసింది. సమీక్షలో సీఎస్‌‌ సోమేశ్ కుమార్, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో సీనియర్ న్యాయవాది రవీందర్ రావు, ఇంటర్ స్టేట్ విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, సూపరింటెండింగ్ ఇంజనీర్ కోటేశ్వర్ రావు పాల్గొన్నారు.